పాలమూరు-రంగారెడ్డి జాప్యంపై సమరభేరి!
8న భారీ ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్:
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలు, సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు.
క్షేత్రస్థాయిలోకి ‘కొత్త స్వరం’
జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు పాండురంగా రెడ్డి తెలిపారు. *"కొత్త తరం కోసం.. కొత్త స్వరం"* అనే నినాదంతో యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తామని, పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికీ చేరుస్తామని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకే టీఆర్ఎస్ సిద్ధమైందని, భవిష్యత్తు రాజకీయాల్లో జిల్లాలో పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జిల్లా ప్రయోజనాల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని పాండురంగా రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతాంగానికి జీవనాధారమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. అధినేత్రి కవిత ఆదేశాల మేరకు ఈ నెల 8న చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు రైతులు, ప్రజాసంఘాలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
