రూ. 1,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

ఐటీ కారిడార్‌లో హైడ్రా మెరుపు దాడి.. 5 ఎకరాల ఆక్రమణలు ధ్వంసం

రూ. 1,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

హైదరాబాద్:

ఐటీ కారిడార్‌ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 42లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మంగళవారం ఆక్రమణల నుంచి విముక్తం చేసింది. ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 1,000 కోట్లు ఉంటుందని అంచనా.

*షెడ్ల కూల్చివేత.. ఫెన్సింగ్ ఏర్పాటు
మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఈ భూమిని కాజేసేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నించారు. అందులో రెండు తాత్కాలిక షెడ్లు, ఒక గదిని నిర్మించడమే కాకుండా, చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి తమదేనంటూ ఎవరినీ అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఐదు ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసింది.WhatsApp Image 2026-06-24 at 15.00.44

*హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
ఆక్రమణల తొలగింపు అనంతరం సదరు స్థలం ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ హైడ్రా అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణే ధ్యేయంగా హైడ్రా చేపట్టిన ఈ మెరుపు దాడి ఐటీ కారిడార్‌లో తీవ్ర కలకలం రేపింది.WhatsApp Image 2026-06-24 at 15.01.24

About The Author