పారిశుద్ధ్యంపై ఆరు రోజుల పాటు ప్రత్యేక దృష్టి సారించాలి

​ట్రైనీ మున్సిపల్ కమిషనర్లకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశం

పారిశుద్ధ్యంపై ఆరు రోజుల పాటు ప్రత్యేక దృష్టి సారించాలి

​హైదరాబాద్:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలో వచ్చే ఆరు రోజుల పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ గ్రూప్-1 ట్రైనీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ కోసం నియమితులైన 18 మంది ట్రైనీ అధికారులతో సోమవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు.
​ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ట్రైనీ అధికారులు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్ల హాజరు వివరాలను సేకరించాలని సూచించారు. చెత్త తరలింపునకు ఉపయోగిస్తున్న సాట్ (SAT) వాహనాలు, రాంకీ వాహనాల పనితీరును పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలపై ఒక పేజీ నివేదికను సమర్పించాలని, ప్రతి సాయంత్రం వెబ్-ఎక్స్ ద్వారా నిర్వహించే సమీక్షా సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఇక్కడ పొందే అనుభవం భవిష్యత్తులో విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు మందా మకరందు, రవికిరణ్ పాల్గొన్నారు.

​ప్రజావాణికి 52 విన్నపాలు:

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 52 ఫిర్యాదులు, విన్నపాలు అందాయి. అదనపు కమిషనర్లు సత్యనారాయణ, రవికిరణ్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు.WhatsApp Image 2026-03-09 at 19.13.59 (3)

About The Author