69వ ఎస్ జి ఎఫ్ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు
రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ పోటీలు
పినపాక :
రాష్ట్రంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్.జి.ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన రెండో రోజు కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు అత్యంత పోటీతత్వంతో తలపడుతూ విజయం కోసం హోరాహోరీగా పోరాడాయి. ఉదయం సెషన్‌లో మధ్యప్రదేశ్ 50–40తో పంజాబ్‌పై, విద్యాభారతి 55–40తో కేవీఎస్‌పై, ఒడిశా 52–43తో చండీగఢ్‌పై గెలుపు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ 70–43తో త్రిపురపై ఘన విజయం సాధించగా, పుదుచ్చేరి 60–46 తో సీఐఎస్‌సీఈను మట్టికరిపించింది. తెలంగాణ జట్టు 46–40తో తమిళనాడుపై విజయం సాధించగా, కర్ణాటక 40–35తో ఢిల్లీని, మహారాష్ట్ర 41–34తో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించాయి. రాజస్థాన్ జట్టు 34–22 తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలుపొందింది. మధ్యాహ్నం సెషన్‌లో హర్యానా 71–25తో కేవీఎస్‌పై ఆధిపత్యం చూపింది. మధ్యప్రదేశ్ 52–35తో ఎన్వీఎస్‌ను, మణిపూర్ 49–34తో జార్ఖండ్‌ను, సీబీఎస్‌ఈ 39–35తో పశ్చిమ బెంగాల్‌ను ఓడించాయి. గుజరాత్ 38–32తో జమ్మూ & కాశ్మీర్‌పై, కేరళ 39–35తో సీబీఎస్‌ఈ వెల్ఫేర్‌పై గెలుపొందాయి. ఉత్తరప్రదేశ్ 34–32తో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించగా, విద్యాభారతి 49–38తో అస్సాం, పంజాబ్ 59–34తో ఎన్వీఎస్‌పై ఘన విజయాలు సాధించాయి. రెండో రోజు మ్యాచ్‌లలో ఆటగాళ్లు ప్రదర్శించిన శక్తి, నైపుణ్యం, వ్యూహాత్మక ఆటతీరు ప్రేక్షకులను ఉత్సాహపరిచిందని నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో పోటీలు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయి.
