ఎల్బీనగర్‌లో తాగునీటి ఎద్దడిపై బీ.జే.పీ సమరభేరి

  • జలమండలి కార్యాలయం ముట్టడి
  •  *ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా అంటూ ఆగ్రహం

ఎల్బీనగర్‌లో తాగునీటి ఎద్దడిపై బీ.జే.పీ సమరభేరి

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న తాగునీటి కొరతను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు, స్థానిక కాలనీవాసులు సోమవారం హయత్ నగర్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (జలమండలి) చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సామ రంగారెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా నిర్వహించారు.

*జలమండలి ముట్టడి – నినాదాల హోరు
నియోజకవర్గంలోని పలు కాలనీల్లో రోజురోజుకూ తాగునీటి సమస్య జటిలమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. ఖాళీ కుండలతో కార్యాలయం ముందుకు చేరుకున్న కాలనీవాసులు, బీజేపీ కార్యకర్తలు జలమండలి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

*కాలనీల ఇబ్బందులు పట్టవా?: సామ రంగారెడ్డి
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ, ఎల్బీనగర్ పరిధిలోని అనేక కాలనీల్లో ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి ముగిసినా నీటి సరఫరాలో ఎలాంటి మెరుగుదల లేకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. లో ప్రెజర్ సమస్య, కలుషిత నీటి సరఫరాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నీటి ఎద్దడి తీర్చకుంటే మున్ముందు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

*ప్రజాప్రతినిధులు, కాలనీవాసుల మద్దతు
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, మొద్దు లచ్చి రెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, చింతల సురేందర్ యాదవ్, రాక్ టౌన్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి, నాయకులు పాల్వయి సంజీవ రెడ్డి, చిలుక రవీందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, శ్రీకాంత్ సహా పెద్ద సంఖ్యలో కాలనీ సంఘాల ప్రతినిధులు, మహిళలు, బీజేపీ శ్రేణులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జలమండలి అధికారులకు సమర్పించారు.

About The Author