నిరుద్యోగుల పోరాటాన్ని అణచలేరు

  •  బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు దత్తాత్రేయ రావు
  • తాండూరులో బీఆర్ఎస్వి నేతల అరెస్టు.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు

నిరుద్యోగుల పోరాటాన్ని అణచలేరు

వికారాబాద్:

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమై అక్రమ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో కాలం వెళ్లదీస్తోందని బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు దత్తాత్రేయ రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తాండూరులోని తమ నివాసాల్లో ఉన్న బీఆర్ఎస్వి జిల్లా నాయకులు దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ రావు మాట్లాడుతూ, నిరుద్యోగులు తమ న్యాయమైన హక్కులు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం శాంతియుతంగా పోరాడుతుంటే అక్రమ అరెస్టులతో వారిని అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అక్రమంగా నిర్బంధించినా నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు అయ్యే వరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

About The Author