అధికారుల అండతో అక్రమ లేఅవుట్ల అరాచకం.

  • బడంగ్‌పేటలో ఏసీబీ దాడులైనా మారని తీరు!
  • ​నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయాలు.. సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్న అవినీతి తిమింగలాలు.
  • ​చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్, బడంగ్‌పేట16 డీసీ సమ్మయ్యలను తక్షణమే సస్పెండ్ చేయాలి.
  • ​టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దినేష్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి.
  • జోనల్ కమిషనర్ చంద్రకళ, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ చర్యలు ఎక్కడ..?
  • ​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అక్రమ సామ్రాజ్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.

అధికారుల అండతో అక్రమ లేఅవుట్ల అరాచకం.

బడంగ్‌పేటలో ఏసీబీ దాడులు జరిగితేనేం, ఇద్దరు కమిషనర్లు ఇంటికి పోతేనేం... ‘చేతులు మారే’ అలవాటు మారనంత కాలం అక్రమార్కులకు తిరుగులేదు! చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ గారు హెచ్ఎండీఏ అనుమతులు, నాలా కన్వర్షన్లతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లను జెట్ స్పీడ్‌తో లాగించేస్తుంటే, బడంగ్‌పేట డీసీ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దినేష్‌లు ఫిర్యాదులు రాగానే కేవలం ‘కంటితుడుపు’ నోటీసులిచ్చి తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు.
సామాన్యుడు ఇల్లు కడితే రూల్స్ మాట్లాడే మున్సిపల్ యంత్రాంగం, ఎకరాల కొద్దీ వెలుస్తున్న దొంగ గేటెడ్ కమ్యూనిటీల ముందు సాష్టాంగ నమస్కారం చేస్తోంది. జోనల్ కమిషనర్ చంద్రకళ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌ల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ పత్రాలతో సామాన్యులను నట్టేట ముంచుతున్న ఈ తిమింగలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే కఠిన విజిలెన్స్ విచారణ జరిపి, సస్పెన్షన్ వేటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


హైదరాబాద్:

నగర శివార్లలోని బడంగ్‌పేట పరిధి (జిహెచ్ఎంసి సర్కిల్ -16) అవినీతి కూపంగా మారింది. గతంలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్లతో సహా పదిమంది అధికారులు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినా, ఏసీబీ దాడులు జరిగినా ఇక్కడి అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం అండతో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA), జీహెచ్‌ఎంసీ నిబంధనలను నడిరోడ్డుపై తగులబెడుతూ.. ఎకరాల కొద్దీ అక్రమ వెంచర్లు, దొంగ గేటెడ్ కమ్యూనిటీలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.WhatsApp Image 2026-06-21 at 19.34.25
ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొడుతూ, సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్న ఈ దందా వెనుక స్థానిక మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

*రూల్స్ బ్రేక్.. రిజిస్ట్రేషన్లు జెట్ స్పీడ్!
చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ భారీ ముడుపుల మత్తులో పడి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయేతర భూమార్పిడి (నాలా కన్వర్షన్) పత్రాలు లేకపోయినా, హెచ్ఎండీఏ లేఅవుట్ అనుమతులు శూన్యమైనా.. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శరవేగంగా ముగించేస్తున్నారు. గతంలో ఇక్కడ రైతు పాసు పుస్తకాల ఆధారంగానే ఏకంగా నిర్మాణ అనుమతులు ఇచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వ రెవెన్యూ విభాగానికి రావాల్సిన కోట్ల రూపాయల పన్నుల ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

*మున్సిపల్ అధికారుల ‘ముడుపుల’ రక్షణ వలయం
ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లేఅవుట్ రుసుములు అధికారుల సొంత జేబుల్లోకి వెళ్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడంగ్‌పేట వృత్త ఉప కమిషనర్ (డీసీ) సమ్మయ్య, పట్టణ ప్రణాళికా విభాగం అధికారి (టౌన్ ప్లానింగ్ ఆఫీసర్) దినేష్ ఈ అక్రమ వెంచర్లకు అభయహస్తం అందిస్తున్నారు. అక్రమ లేఅవుట్లపై ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు, కేవలం కంటితుడుపుగా నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టుకుని మౌనం వహిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ స్థలాలకే ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండా నిర్మాణ అనుమతులు కూడా మంజూరు చేస్తూ అక్రమార్కులకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.WhatsApp Image 2026-06-21 at 19.35.59

*సర్వే నంబర్ల వారీగా అక్రమాల చిట్టా ఇదే:
అధికారుల అండదండలతో నిబంధనల ఉల్లంఘనదారులు బహిరంగంగానే బోర్డులు ఏర్పాటు చేసి, భూగర్భ డ్రైనేజీ పనులు సైతం పూర్తి చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. నాలా కన్వర్షన్ లేకుండా, జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా రీసెంట్ గా వెలిసిన అక్రమ వెంచర్ల వివరాలు:
 *బాలాపూర్ (సర్వే నంబర్లు: 9, 10, 11): సుమారు 2 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేని అక్రమ వెంచర్ యథేచ్ఛగా సాగుతోంది.

 *నాదర్‌గుల్ (సర్వే నంబర్లు: 1-85, 1-86, 1-95, 97, 1-103, 1-105): దాదాపు 5 ఎకరాలలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. పాత గ్రామ పంచాయతీ సర్పంచుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ భూక్రమబద్ధీకరణ (LRS) పత్రాలు సృష్టించి, ప్లాట్లు ఏర్పాటు చేసి మరీ గృహ నిర్మాణ అనుమతులు పొందుతున్నారు.

*సామాన్యుడిపై ప్రతాపం.. భూమాఫియాపై ప్రేమా?
పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకుని 60 లేదా 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే చాలు.. అనుమతులు, నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేసే మున్సిపల్ యంత్రాంగం, ఎకరాల కొద్దీ వెలుస్తున్న అక్రమ వెంచర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న రహస్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అవినీతి భాగోతంలో ఉన్నతాధికారుల వాటా ఎంత? వారి మౌనానికి అర్థమేమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, జోనల్ కమిషనర్ చంద్రకళల నిఘా వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

*అవినీతి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి.. విజిలెన్స్ ఎంక్వయిరీ జరగాలి!
ఫోర్జరీ పత్రాలు, నకిలీ లేఅవుట్లతో సాగుతున్న ఈ దందాలో తెలియక ప్లాట్లు కొని సామాన్య ప్రజలు మోసపోతే బాధ్యులెవరు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలి.

 ‘భారత శక్తి’ డిమాండ్:*
భారీ ముడుపులు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ 'రెహమాన్, అక్రమాలకు వత్తాసు పలుకుతున్న బడంగ్‌పేట ఉప కమిషనర్ "సమ్మయ్యల"ను తక్షణమే సస్పెండ్' చేయాలి.

*టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి.

*ముడుపులు అందుకొని నోటీసులకే పరిమితమైన అధికారుల తీరుపై 'జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విచారణ  జరిపించాలి.

*రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అక్రమ సామ్రాజ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ వెంచర్లను వెంటనే కూల్చివేయాలని ‘భారత శక్తి’ డిమాండ్ చేస్తోంది.WhatsApp Image 2026-06-21 at 19.35.59 (1)WhatsApp Image 2026-06-21 at 19.37.40WhatsApp Image 2026-06-21 at 19.33.36WhatsApp Image 2026-06-21 at 19.34.25WhatsApp Image 2026-06-21 at 19.33.37 (1)WhatsApp Image 2026-06-21 at 19.36.00

About The Author