హైడ్రా ‘మెట్’ టెండర్లు పారదర్శకం: అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
- ఎంపిక కమిటీ పరిశీలన తర్వాతే ఖరారు
- *టెండర్లు దక్కని వారి అక్కసుతోనే తప్పుడు ప్రచారం: హైడ్రా ఘాటు ప్రకటన
హైదరాబాద్:
వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర పనుల నిమిత్తం ఏర్పాటు చేసే 'మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్' ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (HYDRA) గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన తొమ్మిది మంది ఇంజినీర్లతో కూడిన ప్రత్యేక కమిటీ నిబంధనల ప్రకారమే టెండర్లను పరిశీలించి, ఖరారు చేసిందని వెల్లడించింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.
*నిబంధనల్లో స్వల్ప సడలింపు.. అందుకే!
వర్షాల తీవ్రత దృష్ట్యా నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని 'మెట్' వాహనాలను క్షేత్రస్థాయిలోకి దించే ముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) సర్టిఫికేట్, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ పత్రాలను సమర్పించాలనే నిబంధనపై టెండర్ల ఖరారు సమయంలో స్వల్ప సడలింపు ఇచ్చినట్లు హైడ్రా తెలిపింది. అయితే, కాంట్రాక్టర్ల గత అనుభవం, ఆర్థిక సామర్థ్యం, సొంత లేదా లీజు వాహనాలు కలిగి ఉండాలనే కీలక నిబంధనల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేవలం చిన్న సాంకేతిక కారణాలను బూతద్దంలో చూపిస్తూ, టెండర్లు దక్కించుకోలేకపోయిన కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై, హైడ్రాపై బురదజల్లేందుకు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గతంలో ఈ వ్యవస్థ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు కూడా కొందరు కాంట్రాక్టర్లు ఇలాంటి బెదిరింపులకు, ఆరోపణలకు దిగి టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నించేవారని హైడ్రా గుర్తుచేసింది. గత ఏడాది నుంచి ఈ పనుల బాధ్యతను హైడ్రా స్వీకరించింది. ప్రారంభంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి సమర్థులైన వారికే టెండర్లు అప్పగించామని, గత వర్షాకాలంలో 'మెట్' బృందాలు ఎంత అద్భుతంగా పనిచేశాయో నగర ప్రజలందరికీ తెలుసని పేర్కొంది.
*ఒకే కాంట్రాక్టర్ 30 టెండర్లకు దరఖాస్తు.. నిబంధనలు ఉల్లంఘించడంతోనే తిరస్కరణ
ప్రస్తుతం జరుగుతున్న అసత్య ప్రచారానికి ప్రధాన కారకుడు పట్నం శ్రీశైలం అనే కాంట్రాక్టరేనని హైడ్రా బహిరంగపరిచింది. గత ఏడాది కూడా వారం రోజుల్లో సొంత వాహనాలను సమకూరుస్తానని హామీ ఇచ్చి, వర్షాకాలం ముగిసే వరకు రోజువారీ అద్దె వాహనాలతోనే కాలయాపన చేశారని తెలిపింది. ఈ ఏడాది కూడా సదరు కాంట్రాక్టర్ ఏకంగా 30 టెండర్లకు దరఖాస్తు చేసుకున్నారని, కానీ సొంత వాహనాలు లేదా లీజుకు తీసుకున్నట్లు ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలను సమర్పించలేదని కమిటీ గుర్తించింది. దీంతో నిబంధనల ప్రకారం టెండర్ల ఎంపిక కమిటీ ఆ దరఖాస్తులను తిరస్కరించడంతో, ఆ కక్షతోనే తప్పుడు ప్రచారానికి తెరలేపారని హైడ్రా విమర్శించింది.
ఇటీవల జూన్ 9, 12 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు నగరంలో ట్రాఫిక్ స్తంభించిన నేపథ్యంలో, 'మెట్' బృందాలను తక్షణమే రంగంలోకి దించాలనే పట్టుదలతో అధికారులు పనిచేశారు. మూడు కమిషనరేట్లకు చెందిన ఇంజినీర్లు, హైడ్రా అధికారులతో కూడిన కమిటీ సెలవు దినాల్లో సైతం 24 గంటలూ శ్రమించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.
అవకాశాలు పెంచేందుకే సవరణలు :
> పూడికతీత , ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్ పనులు చేసే కాంట్రాక్టర్లకు కూడా ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని కొందరు ప్రతినిధులు కమిషనర్‌ను కోరారు. దాంతో ఎక్కువ మందికి అవకాశం కల్పించి, ఆరోగ్యకరమైన పోటీ ద్వారా సమర్థులను ఎంపిక చేసేందుకు జూన్ 10న సవరణ ప్రకటన (Corrigendum) జారీ చేయడం జరిగింది.
ఇంత పారదర్శకంగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా చర్యలు తీసుకుంటుంటే.. వ్యక్తిగత స్వార్థంతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది.
