ఎల్బీనగర్‌కు మహర్దశ: రేపే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘వన మహోత్సవం’

116 ఎకరాల్లో అత్యాధునిక అర్బన్ పార్కుకు శంకుస్థాపన; రూ.20 కోట్లతో బాక్స్ డ్రైన్ పనులు

ఎల్బీనగర్‌కు మహర్దశ: రేపే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘వన మహోత్సవం’

హైదరాబాద్: 

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బి.ఎన్.రెడ్డి నగర్ ఫారెస్ట్ (అటవీ) ప్రాంతంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో భాగంగా వెయ్యి మంది పాఠశాల విద్యార్థులతో కలిసి సీఎం స్వయంగా మొక్కలు నాటనున్నారు. అనంతరం అక్కడ నిర్మించనున్న భారీ అర్బన్ పార్కుకు (పట్టణ పార్కు) శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అధికారులతో కలిసి సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) వినయ్ కుమార్, అటవీ సంరక్షణాధికారి (చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ప్రియాంక వర్గీస్‌లతో మాట్లాడి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.

*30 ఏళ్ల భూవివాదానికి చెక్.. కేబీఆర్ పార్కు తరహాలో అభివృద్ధి!
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ, గత ముప్పై ఏళ్లుగా నలుగుతున్న భూవివాదాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా పరిష్కరించిందని చెప్పారు. బి.ఎన్.రెడ్డి నగర్ వాసులకు హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు తరహాలోనే 116 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఒక అద్భుతమైన, ఆహ్లాదకరమైన అటవీ పార్కు అందుబాటులోకి రాబోతోందని, ఇది స్థానిక ప్రజల అదృష్టమని కొనియాడారు.

*రూ.20 కోట్లతో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
కేవలం పార్కు నిర్మాణమే కాకుండా, బి.ఎన్.రెడ్డి నగర్ మరియు దాని చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మధుయాష్కి తెలిపారు.

 *వర్షపు నీరు, మురుగు నీరు సజావుగా సాగిపోయేందుకు రూ.20 కోట్ల వ్యయంతో బాక్స్ డ్రైన్ (భారీ మూసివున్న డ్రైనేజీ కాలువ) మరియు కొత్త డ్రైనేజీ లైన్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

*ప్రజలంతా తరలిరావాలి: మధుయాష్కి పిలుపు
గురువారం సాయంత్రం జరిగే ఈ వన మహోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా పరిసర కాలనీల నివాసితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

*కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల.వెంకటేశ్వర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగొని లక్ష్మీప్రసన్న, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మకుటం సదాశివుడు, శశిధర్ రెడ్డి, చెన్నగోని రవీందర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, గణేష్ నాయక్, నాయకులు పర్వతి గణేష్ రెడ్డి, రఘుమారెడ్డి, రజిని రావు, కంచర్ల కవిత, విద్యా రెడ్డి, భాను, వినయ్ పటేల్, దాము మహేందర్ యాదవ్, శ్రీనాథ్, మతీన్ షరీఫ్, కొండోజు శ్రీనివాస్, తోకటి కిరణ్, బండిగారి శ్రీనివాస్, నరేష్ గుప్త, మక్సుద్, షేక్ షాకీర్, ప్రవీణ్ రెడ్డి, సూర్యనారాయణ, రాజశేఖర్ రెడ్డి, భవాని శంకర్, శశికాంత్, రేణు గౌడ్, అంతటి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ గౌడ్, నంద కిషోర్, ప్రశాంత్ గౌడ్, భవాని, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author