అక్రమ ఇసుక వేలంలో అవినీతి..

  • రెవెన్యూ అధికారుల పై  చర్యలు తీసుకోవాలి
  • ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ 
  • రూ.6 లక్షల విలువైన ఇసుకను రూ.36 వేలకే కేటాయించారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం

అక్రమ ఇసుక వేలంలో అవినీతి..

వికారాబాద్:
 
అక్రమ ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వేలంపాట నిర్వహించి అవినీతి, అక్రమాలకు పాల్పడిన యాలాల మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) శివచరణ్ కుమార్‌ , అలగే సహకరించిన రెవెన్యూ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో గత రెండు సంవత్సరాలుగా అనుమతి లేకుండా తరలించిన ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకుని యాలాల పోలీస్‌స్టేషన్‌లో డంప్ చేశారని తెలిపారు. సుమారు 120 ట్రిప్పులకు సంబంధించిన ఇసుకను అక్కడ నిల్వ ఉంచినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి ఇసుకను వేలంపాట వేయాలంటే బహిరంగ పత్రికా ప్రకటన ద్వారా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉండగా, ఎలాంటి ప్రకటన లేకుండా ఏకపక్షంగా వేలం నిర్వహించి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆర్‌ఐ శివచరణ్ కుమార్ స్వేచ్ఛాచారిగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, సుమారు రూ.6 లక్షల విలువైన ఇసుకను కేవలం రూ.36 వేలకే కేటాయించడం వెనుక అక్రమాలు ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికే భూ వివాదాలు, అక్రమ ఎర్రమట్టి వ్యవహారాల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఐపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేదంటే త్వరలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, నాయకులు లాలయ్య, చంద్రయ్య, శానప్ప, మహిపాల్ రెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారుWhatsApp Image 2026-06-21 at 18.58.15 (1)

About The Author