ఒడిశా-హైదరాబాద్ గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు: ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్, 51.8 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశా-హైదరాబాద్ గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు: ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్, 51.8 కేజీల గంజాయి స్వాధీనం

అబ్దుల్లాపూర్‌మెట్:

 ఒడిశా నుంచి హైదరాబాద్‌కు యథేచ్ఛగా సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ (SOT), అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్‌లో విజయవంతంగా చేధించారు. ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 25.90 లక్షల విలువైన 51.800 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన మహీంద్రా బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

*నిందితుల వివరాలు
పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అందరూ ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందినవారే. వారి వివరాలు ఇలా ఉన్నాయి:
 1. కాములు పాంగి (37): వృత్తిరీత్యా రైతు, ఖైర్‌పుట్ మండలం, బందాదురై గ్రామం.
 2. బాబిని హంతాల్ (31): మెకానిక్/రైతు, చిత్రకొండ మండలం, ఈలంపాక గ్రామం.
 3. కృష్ణ హంతాల్ (29): వృత్తిరీత్యా డ్రైవర్, ఖైర్‌పుట్ మండలం, ఆంధ్రాహెల్ గ్రామం.

*కేసు నేపథ్యం.. పక్కా ప్లాన్
పోలీసుల కథనం ప్రకారం.. కాములు పాంగి, బాబిని హంతాల్ గత ఆరు నెలలుగా ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మల్కన్‌గిరి జైలులో పరిచయమైన 'సాగర్' అనే వ్యక్తితో వీరు డీల్ కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌లో గంజాయి సప్లై చేస్తే భారీగా డబ్బు ఇస్తానని సాగర్ ఆశ చూపించడంతో, వీరు ఘట్‌కేసర్ వద్ద డెలివరీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ ప్లాన్ ప్రకారం.. ఈ నెల 15న ఒడిశాలోని ఈలంపాక గ్రామం నుంచి మహీంద్రా బొలెరో వాహనం (Reg. No. OD-10-C-5377) వెనుక సీటు కింద గంజాయి ప్యాకెట్లను అత్యంత చాకచక్యంగా దాచి హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్ చేరుకున్నాక రామోజీ ఫిల్మ్ సిటీ పరిసరాల్లో వేచి చూశారు. నిన్న (జూన్ 17న) సాయంత్రం సాగర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గంజాయిని ఘట్‌కేసర్ వైపు తరలించడం ప్రారంభించారు.

*ఒఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద పట్టుబడ్డారు
నమ్మదగిన సమాచారం అందుకున్న ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి నిఘా పెట్టింది. బుధవారం సాయంత్రం 6:25 గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని తారా కన్వెన్షన్ సమీపంలో, ఓఆర్ఆర్ (ORR) సర్వీస్ రోడ్డుపై అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా వెనుక సీటు కింద దాచిన 51.800 కేజీల గంజాయి బయటపడింది.

*స్వాధీనం చేసుకున్న సొత్తు:
* 51.800 కేజీల గంజాయి (విలువ రూ. 25,90,000/-)
 * మహీంద్రా బొలెరో వాహనం (OD-10-C-5377)
  * రూ. 2,290/- నగదు
  * 3 మొబైల్ ఫోన్లు

పరారీలో ప్రధాన నిందితుడు
ఈ కేసులో గంజాయిని రిసీవ్ చేసుకోవాల్సిన సాగర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పిఎస్ లో క్రైమ్ నెం. 507/2026, ఉ/సె 8(c) r/w 20(a), 20(b)(ii)(C) NDPS చట్టం-1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడితో పాటు ఈ అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌తో సంబంధమున్న మిగిలిన లింకులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే తమ టాప్ ప్రయారిటీ అని అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ సప్లై చైన్‌ను తుంచివేయడంతో పాటు, పెడ్లర్లు, వినియోగదారులను గుర్తిస్తున్నామని.. ప్రజలు కూడా డ్రగ్స్ కు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా పోలీసులతో పంచుకుని సహకరించాలని కోరారు.
ఈ విజయవంతమైన ఆపరేషన్ మల్కాజ్‌గిరి కమిషనరేట్ సీపీ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్  ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఎల్బీనగర్ జోన్ డీసీపీ శ్రీమతి బి. అనురాధ, ఐపీఎస్, ఎస్‌ఓటీ డీసీపీ శ్రీ కె. మనోహర్, అడిషనల్ డీసీపీ శ్రీ ఎండీ. షాకిర్ హుస్సేన్ ల మార్గదర్శకత్వంలో ఎస్‌ఓటీ ఎల్బీనగర్ టీమ్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు.

About The Author