జీవనశైలిలో యోగాను భాగం చేసుకోవాలి: దామోదర రాజనర్సింహ
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
హైదరాబాద్:
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవనశైలిలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
*సమగ్ర జీవన విధానం యోగా
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వమని కొనియాడారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సు, శరీరం, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పే ఒక సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా అత్యుత్తమ మార్గమని స్పష్టం చేశారు. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.
ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని మంత్రి గుర్తుచేశారు. నేడు ప్రపంచ దేశాలన్నీ భారతీయ యోగా సంప్రదాయాన్ని ఆదరిస్తుండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు.
"ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రతి ఇంటిలో యోగా సంస్కృతి పెంపొందితే ఆరోగ్య సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు" అని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్థు, జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి, రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్, శేరిలింగంపల్లి తహసీల్దార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి, వివిధ శాఖల అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

