కోకాపేట్‌లో అక్రమార్కులకు ‘నార్సింగి’ అధికారుల అభయహస్తం!

  • *డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి లీలలు.. ఏసీపీ మనోహర్ ‘తిక్క’ సమాధానాల వెనుక కథేంటి?
  • *నివాస భవనంలో యథేచ్ఛగా వ్యాపారాలు.. మూడు నెలలుగా బాధితుల ఫిర్యాదులు బుట్టదాఖలు!
  • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ శ్రీజన ఐఏఎస్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..

కోకాపేట్‌లో అక్రమార్కులకు ‘నార్సింగి’ అధికారుల అభయహస్తం!

కోకాపేట్‌లో నివాస భవనాలు నిస్సిగ్గుగా వాణిజ్య సామ్రాజ్యాలుగా మారుతుంటే, నార్సింగి మున్సిపల్ అధికారులు 'ముడుపుల' మత్తులో జోగుతున్నారు. డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ ‘మై క్యూర్’ యాప్‌ను అపహాస్యం చేయగా, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ‘తిక్క’ సమాధానాలతో అక్రమార్కులకు అభయహస్తమిస్తున్నారు. చట్టాలు పక్కనబెట్టి సొంత చట్టాలు నడుపుతున్న ఈ జోడీ లీలలపై తక్షణమే విచారణ జరిపించాల్సిందే.


*హైదరాబాద్:

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం, కోకాపేట్ పరిధిలో మున్సిపల్ చట్టాలు, నిబంధనలు నవ్వులపాలవుతున్నాయి. నివాస గృహాల అనుమతులతో నిర్మించిన భవనంలో నిస్సిగ్గుగా వ్యాపారాలు సాగిస్తున్నా.. నార్సింగి మున్సిపల్ అధికారులు ‘ముడుపుల’ మత్తులో జోగుతూ అక్రమార్కులకు రక్షణ వలయంగా మారారు. సర్వే నంబర్ 165 లోని ప్లాట్ నంబర్లు 6, 6/A భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు శూన్యం, కనీస ఖాళీ స్థలాలు మృగ్యం! ఇంతటి ఘోర ఉల్లంఘనలు కళ్లముందే కనిపిస్తున్నా, డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ ద్వయం అక్రమార్కులకు సాష్టాంగ నమస్కారం చేస్తుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

*కృష్ణమోహన్ రెడ్డి గారూ.. ‘మై క్యూర్’ యాప్ అంటే మీకో హేళనా?
ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ అప్లికేషన్లను సైతం నార్సింగి డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తన నిర్లక్ష్యంతో అపహాస్యం చేస్తున్నారు. బాధితులు ఏప్రిల్ 17వ తేదీనే ఈ అక్రమ దందాపై ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి సదరు భవనాన్ని సీజ్ చేయాల్సిన డిప్యూటీ కమిషనర్, కేవలం అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయని కంప్యూటర్‌లో నమోదు చేసి, బాధితులకు సమాధానం కూడా చెప్పకుండా ఫిర్యాదు దరఖాస్తులను క్లోజ్ చేసేశారు. బాధితులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే "సమావేశాల్లో ఉన్నాం" అంటూ తప్పించుకు తిరగడం వెనుక ఉన్న రహస్యమేమిటి? అక్రమార్కుల నుంచి అందుతున్న ‘నెలవారీ’ నజరానాలే మీ ఈ మౌనానికి కారణమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.WhatsApp Image 2026-06-21 at 20.08.35

*ఏసీపీ మనోహర్ గారూ.. చట్టమంటే లెక్కలేదా? ఎందుకీ తిక్క సమాధానాలు?
అక్రమ భవనంపై తీసుకున్న చర్యల వివరాలను తెలుసుకునేందుకు బాధితులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే, నార్సింగి టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ చట్టాన్ని తుంగలో తొక్కారు. బాధ్యత గల అధికారిక స్థానంలో కూర్చుని, అడిగిన సమాచారాన్ని దాస్తూ.. పొంతన లేని, తిక్క తిక్క సమాధానాలతో బాధితులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగమే ఇలా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ, సమాచారాన్ని తొక్కిపెట్టడం వెనుక భారీగా చేతులు మారిన ముడుపుల వ్యవహారం దాగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏసీపీ మనోహర్ వైఖరి చూస్తుంటే నార్సింగిలో టౌన్ ప్లానింగ్ చట్టాలు కాకుండా ‘మనోహర్ సొంత చట్టాలు’ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

 *‘భారత శక్తి’ డిమాండ్:
 *నివాస భవనంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న వ్యాపార సముదాయాన్ని తక్షణమే సీజ్ చేయాలి.

 *ప్రభుత్వ అప్లికేషన్లను హేళన చేస్తూ, బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిన డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని తక్షణమే విచారించాలి.

 *సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ, బాధితులకు తిక్క సమాధానాలు చెబుతూ అక్రమార్కులను కాపాడుతున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి.

 *నార్సింగి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ అనుమతులు, ముడుపుల భాగోతంపై ఉన్నతాధికారులు మరియు విజిలెన్స్ విభాగం తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి.WhatsApp Image 2026-06-21 at 20.10.06

About The Author