*సర్ ద్వారా ఓట్ల తొలగింపుతో బీజేపీ లబ్ధి పొందుతోంది: మధుయాష్కి గౌడ్
- *క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు సమర్థవంతంగా పనిచేయాలి
- *ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం
*ఎల్బీనగర్:
ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) ద్వారా బీజేపీ ప్రభుత్వం తమ వ్యతిరేక వర్గాల ఓట్లను తొలగించి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇదే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణ కార్యక్రమం శుక్రవారం రాక్ హిల్స్ కాలనీలోని ఎస్.వి.ఎల్ ఎరీనాలో జరిగింది. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, బీఎల్ఏల నియోజకవర్గ సమన్వయకర్త వెన్నెల గద్దర్, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో జరిగిన ఎస్‌ఐఆర్‌లో భాగంగా దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించి, ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందిందని విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ తక్కువ వ్యవధిలోనే అనూహ్యంగా 1.2 కోట్ల కొత్త ఓట్లను చేర్చి ప్రయోజనం పొందారన్నారు. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తినప్పటికీ అటు ఎన్నికల సంఘం (ఈసీ) గానీ, ఇటు సుప్రీంకోర్టు గానీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ స్వయంగా వంద నియోజకవర్గాల్లో ఓట్ల కౌంటింగ్ లోపాలను బయటపెట్టారని గుర్తు చేశారు. ఈసీఐ (ఎన్నికల సంఘం) కాస్తా ఈడీ, సీబీఐ, ఐటీగా మారిందని.. ప్రతిపక్ష నేతలపై దాడులు, కేసులు పెడుతూ బీజేపీ బెదిరింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో జరగనున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓటర్ల తొలగింపు, చేర్పులపై బూత్ లెవెల్ అధికారులతో (బీఎల్ఓ) సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
*ఓట్ చోరీకి మోదీ ప్రభుత్వం కుట్ర: చల్లా నరసింహారెడ్డి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతోందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా పేద వర్గాల ఓట్లు గల్లంతు కాకుండా బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇప్పుడు జరుగుతున్న ఓటరు సవరణ ప్రక్రియలో పార్టీ బీఎల్ఏలు క్రియాశీలకంగా పనిచేయాలని వెన్నెల గద్దర్ కోరారు.
*ఎల్బీనగర్‌లో 74 శాతం ఓటర్ మ్యాపింగ్ తేడాలు: మల్ రెడ్డి రాంరెడ్డి
రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను అంత ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఇటీవల బీఎల్ఓలు నిర్వహించిన సర్వేలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏకంగా 74 శాతం మంది ఓటర్ మ్యాపింగ్‌లో తేడాలు ఉన్నట్లు తేలిందని గుర్తు చేశారు. దీనిని బట్టి భారీగా ఓట్లు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, బీఎల్ఏలు అత్యంత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం టీపీసీసీ శిక్షకుడు చైతన్య కృష్ణారెడ్డి బీఎల్ఏలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై, వారి బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..jpeg)
