నందనవనంలో అర్ధరాత్రి మహనీయుల విగ్రహాల తొలగింపు
- మహనీయుల విగ్రహాలపై రాజకీయమా....??
- విగ్రహాలను తొలగింపజేసిన ఆ అదృశ్య శక్తి ఎవరు...?
- బాబా సాహెబ్ జయంతి రోజే తొలగించాలా...అసలు కారణం ఏందీ..?
- మధ్యరాత్రి 3 గంటలకు పోలీసుల హంగామా ఎందుకు...?
- 3 వందల మంది పోలీసుల బందోబస్తు ఎందుకు..? ఎవరి మీద కక్ష...?
- విగ్రహాలు యధావిథిగా ఏర్పాటు చేయాలనీ దళిత సంఘాల డిమాండ్...
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ పరిధిలోని నందనవనం కాలనీ లక్కీ హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన డా. బిఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు అనగా సోమవారం ఘనంగా ఆవిష్కరించుకున్న ఈ మహనీయుల విగ్రహాలను పార్టీలకతీతంగా స్థానికులు, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఇతర నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. అయితే ఏర్పాటు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రోజు గడవకముందే మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అనుమతులు లేవన్న కారణంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య విగ్రహాలను అక్కడి నుండి తొలగించారు. అధికారులు తీసుకున్న ఈ చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలకు అనుమతి అవసరమా?” అంటూ ప్రశ్నించారు.స్థానిక సంఘాల నాయకులు నిరసన తెలిపారు. విగ్రహాల తొలగింపును నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ‘మాకు న్యాయం కావాలంటూ ’ ధర్నా చేపట్టారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని, తిరిగి విగ్రహాలను ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ జయంతి రోజునే ఈ ఘటన జరగడం పట్ల దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇది చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. విగ్రహాల తొలగింపులో వెనక ఉన్న అదృష్య శక్తి ఎవరో బయటకు రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒక మూలన, ఎవరికీ ఇబ్బంది కలుగకుండా విగ్రహాలు ఏర్పాటు చేసి ఆరాధించుకుంటామంటే అనుమతులు ఇవ్వని అధికారులు, మరి ప్రజలు, వాహనదారులు ప్రయాణించే రోడ్లపై, రోడ్ల పక్కన అనుమతులు లేకుండా ఫుట్ పాత్ లు ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మహనీయుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి విగ్రహాలు ఏర్పాటు చేసిన చోటనే తిరిగి అధికారులు విగ్రహాలు ఏర్పాటు చేసేలా ఆందోళనలు చేపడతామని దళిత సంఘాల నాయకులు, స్థానికులు పేర్కొన్నారు
