చిన్న పత్రికల ఉనికిపై 'ఎంప్యానల్' ఉచ్చు
- అక్రెడిటేషన్ల నిరాకరణపై టీయూడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల పోరాటం,
సమాచార భవన్ ముట్టడి.. రెండు గంటల పాటు ధర్నా.. - ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్నా పట్టించుకోని సర్కారు
హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఎన్‌ఐ (RNI), పీఆర్‌జీఐ (PRGI) గుర్తింపు ఉండి, నిబంధనల ప్రకారం నడుస్తున్న చిన్న, మధ్య తరహా పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టు లోకం గళమెత్తింది. అక్రెడిటేషన్ కార్డుల జారీలో ఎంప్యానల్‌మెంట్‌ను సాకుగా చూపుతూ వేలమంది పాత్రికేయుల హక్కులను కాలరాస్తున్నారంటూ మంగళవారం 'ఛలో సమాచార భవన్' ఉద్రిక్తంగా సాగింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన జర్నలిస్టులు మాసబ్ ట్యాంక్‌లోని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
నిబంధనల పేరుతో అణిచివేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న సరళతరమైన అక్రెడిటేషన్ విధానానికి స్వరాష్ట్రంలో స్వస్తి పలకడంపై జర్నలిస్టు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఆర్‌ఎన్‌ఐ రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన, సర్క్యులేషన్ ఆధారంగా కార్డులు ఇచ్చే వారని, కానీ ప్రస్తుతం 'ఎంప్యానల్‌మెంట్' అనే అడ్డుగోడను సృష్టించి చిన్న పత్రికల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 44 వేల కార్డులు ఇస్తామని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని, కేవలం కొన్ని పెద్ద సంస్థలకే ప్రాధాన్యం ఇస్తూ క్షేత్రస్థాయి విలేకరులను విస్మరిస్తున్నారని ఆరోపించారు..jpeg)
హామీలకే పరిమితమైన ఆదరణ
అధికారంలోకి రాకముందు జర్నలిస్టుల సమస్యలపై గళమెత్తిన నాయకులు, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చిన్న పత్రికల పట్ల అదే మొండివైఖరిని అవలంబించడం గమనార్హం. గతంలో జాబితాలో ఉన్న పత్రికలను సైతం ప్రస్తుతం ఎంప్యానల్‌మెంట్ నుంచి తొలగించడం 'మూలిగే నక్కపై తాటికాయ' పడ్డ చందంగా మారిందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పేర్కొన్నారు. ప్రకటనల కేటాయింపు పక్కన పెడితే, కనీసం జర్నలిస్టుగా గుర్తింపునిచ్చే కార్డును కూడా నిరాకరించడం దారుణమని విమర్శించారు.
గుర్తింపు కార్డులు: ఎంప్యానల్‌మెంట్‌తో సంబంధం లేకుండా ఆర్‌ఎన్‌ఐ గుర్తింపు ఉన్న ప్రతి పత్రికా ప్రతినిధికి అక్రెడిటేషన్ ఇవ్వాలి.
మౌలిక సదుపాయాలు: ప్రింటింగ్ ప్రెస్‌ల ఏర్పాటుకు నామినల్ ధరకే ఎకరం భూమిని కేటాయించి, రుణ సదుపాయం కల్పించాలి.
సంక్షేమ పథకాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.
దాదాపు రెండు గంటల పాటు కార్యాలయ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం, ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ జగన్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తన్నీరు శ్రీనివాస్, పాండురంగారావు సహా వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
