నగరాభివృద్ధికి ‘స్టాండింగ్’ గ్రీన్ సిగ్నల్

  • 20 ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం
  • ​క్రీడా మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై దృష్టి
  • ​ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు మార్పు ప్రతిపాదన ప్రభుత్వానికి..

నగరాభివృద్ధికి ‘స్టాండింగ్’ గ్రీన్ సిగ్నల్

​హైదరాబాద్:

నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి మరియు ప్రజా ఉపయోగకర పనులే ధ్యేయంగా జీహెచ్‌ఎంసీ అడుగులు వేస్తోంది. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మేయర్ అధ్యక్షతన నిర్వహించిన 12వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. ఎజెండాలోని 9 అంశాలతో పాటు మరో 11 అదనపు అంశాలకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

​క్రీడలకు పెద్దపీట.. బాక్సింగ్ కోర్టు నిర్మాణం

​నగర యువతను క్రీడల వైపు ప్రోత్సహించేలా కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. 
చందానగర్ పీ అండ్ టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొత్తగా బాక్సింగ్ కోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కేపీహెచ్‌బీ కాలనీలోని క్రికెట్ ప్రాక్టీస్ పిచ్‌లు, ఇండోర్ షటిల్ కోర్టుల నిర్వహణ బాధ్యతలను ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (EOI) ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే బాలానగర్, నెక్సస్ మాల్ ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దే ప్రతిపాదనలకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

​రహదారుల విస్తరణ.. చెరువుల సుందరీకరణ:

​నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రహదారుల బలోపేతంపై కమిటీ దృష్టి సారించింది.
​ఆనంద్‌నగర్-మంసూరాబాద్: 30 మీటర్ల మేర రహదారి విస్తరణకు గానూ 195 ఆస్తుల స్వాధీనం, మాస్టర్ ప్లాన్ మార్పులకు ఆమోదం తెలిపారు.
​సరోజినీనగర్-కోణార్క్ రోడ్డు: ఇక్కడ 256 ఆస్తుల స్వాధీనం ద్వారా 30 మీటర్ల రోడ్డు విస్తరణ పనుల పురోగతిని ప్రభుత్వానికి నివేదించనున్నారు.
​కుషాయిగూడ: మారుతి ఎన్‌క్లేవ్ నుంచి పోచమ్మ ఆలయం వరకు దెబ్బతిన్న బీటీ రోడ్ల రీకార్పెటింగ్‌కు అనుమతి లభించింది.
​నడిమి చెరువు: సాఫిల్గూడ నడిమి చెరువులో గుర్రపుడెక్క తొలగింపు, ఫెన్సింగ్ మరియు డ్రైనేజీ మళ్లింపు పనుల ద్వారా చెరువును సుందరీకరించనున్నారు.

​మౌలిక సదుపాయాలు - ప్రజా సౌకర్యాలు:

​కాప్రా, ఉప్పల్ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు కమిటీ ఆమోదముద్ర వేసింది. వైకుంఠధామాల నిర్వహణను మెరుగుపరచడంలో భాగంగా మూసాపేట సర్కిల్ పరిధిలోని శ్మశానవాటిక నిర్వహణ బాధ్యతలను బిడ్డింగ్ ద్వారా అప్పగించాలని నిర్ణయించారు.

​కారిడార్ పేరు మార్పు:

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్‌కు *‘శ్రీ బండారి రాజీ రెడ్డి కారిడార్’*గా పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై కమిటీ చర్చించింది. దీనిపై తుది నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని తీర్మానించారు.
​ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, జగదీశ్వర్ గౌడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author

Related Posts