ఉద్యమకారుల త్యాగాలను కించపరచవద్దు.

హైకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి నేత పాండురంగా రెడ్డి అభ్యంతరం

ఉద్యమకారుల త్యాగాలను కించపరచవద్దు.

హైదరాబాద్‌: 

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల పట్ల గౌరవ హైకోర్టు చేసినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి స్థలాలు, పింఛన్ల కేటాయింపు అంశంపై విచారణ సందర్భంగా.. "మీరేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?" అని న్యాయస్థానం ప్రశ్నించడం వేలాది మంది ఉద్యమకారుల మనోభావాలను గాయపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

​పోరాటం ఆత్మగౌరవం కోసమే..

​1969 నుంచి 2014 వరకు సాగిన ఉద్యమం ఆధిపత్య పాలన నుంచి విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిందని పాండురంగా రెడ్డి గుర్తుచేశారు. ఇది స్వాతంత్ర్య పోరాటంతో సమానమైనదని, ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి చూడటం సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు కేవలం ఓట్ల కోసం కాదని, అవి బాధ్యతాయుతమైన పౌరులకు ఇచ్చే భరోసా అని స్పష్టం చేశారు. ఆ హామీల అమలును కోరడం ప్రతి ఉద్యమకారుడి రాజ్యాంగబద్ధమైన హక్కని వివరించారు.

​ప్రభుత్వానిదే బాధ్యత

​ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని.. నేడు రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఆదాయానికి, జరుగుతున్న అభివృద్ధికి ఉద్యమకారుల పోరాటమే మూలమని ఆయన పేర్కొన్నారు. "ప్రభుత్వం ఎంతమందికి ఇవ్వగలదు?" అనే కోణంలో కాకుండా, రాష్ట్రం కోసం కష్టపడిన వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యతగా గుర్తించాలని కోరారు. 

న్యాయస్థానాలు కేవలం చట్టాలనే కాకుండా, చారిత్రక నేపథ్యాలను, ప్రజా సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మేలు చేయవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

About The Author