బ్రిడ్జి నిర్మాణానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
ఎల్బీనగర్:
మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల ప్రజలకు చాలా సంవత్సరాలుగా పరిష్కారం కాని సరూర్‌నగర్ చెరువు కట్ట మీద బ్రిడ్జి నిర్మాణం,ట్రాఫిక్ సమస్యలకు నేడు పరిష్కారం దిశగా ముందడుగు పడింది.ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే మార్గం సుగమమైందని స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తపరిచారు.సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ సమీపంలోని ప్రియదర్శిని పార్క్ వద్ద నిర్మించనున్న ప్రధాన లింక్ బ్రిడ్జి పనులకు మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, పట్నం మహేందర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్,మిద్దెల జితేందర్, రాంమోహన్ గౌడ్,తదితర కాంగ్రెస్ నాయకుల సమక్షంలో శంకుస్థాపన జరిగింది.ఈ బ్రిడ్జిని ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.ఈ కీలక ప్రాజెక్ట్‌కు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మధు యాష్కీ గౌడ్,స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చొరవతో నేడు కార్యరూపం దాల్చిందని మంత్రి తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సరూర్‌నగర్, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి,ప్రజలకు సులభమైన రాకపోకల సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కందికంటి శ్రీధర్ గౌడ్, మహేందర్ యాదవ్, శంకర్ యాదవ్, శరత్ గుప్తా, ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
