ఆర్భాటం వదిలి.. అనాథల చెంతకు!
సేవాపథంలో ‘బతుకమ్మ’ హీరో విజయ్ భాస్కర్
- పుట్టినరోజున మానవత్వం చాటుకున్న నటుడు
ఎల్బీనగర్:
వెండితెరపై ‘బతుకమ్మ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ భాస్కర్ తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచారు.
ఆర్భాటాలకు, వేడుకలకు దూరంగా ఉంటూ.. మానవత్వమే పరమావధిగా నగరంలోని ‘రెడీ టూ సర్వ్’ స్వచ్ఛంద సంస్థలో అనాథలు, వృద్ధుల మధ్య గడిపారు.
పుట్టినరోజు సందర్భంగా విజయ్ భాస్కర్ అక్కడ ఉన్న వృద్ధులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారని, కానీ విజయ్ భాస్కర్ ఇలా సామాన్యుల మధ్యకు వచ్చి పలకరించడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అక్కడి వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు.
సమాజానికి స్ఫూర్తి:
ఈ సందర్భంగా ‘రెడీ టూ సర్వ్’ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ.. “విజయ్ భాస్కర్ లాంటి కళాకారులు సమాజానికి దిక్సూచి వంటి వారు. తమ పుట్టినరోజును సామాజిక సేవకు అంకితం చేయడం గొప్ప పరిణామం” అని కొనియాడారు.
తోటి వారికి తోడ్పడటమే అసలైన పుట్టినరోజు కానుకని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపితమైంది.
