సీబీఐ అప్పీల్‌పై ‘జాగృతి’ ఫైర్.
- కేంద్రం మెప్పు కోసమే కొత్త డ్రామాలు
- కవితపై మోపిన అబద్ధపు కేసులు నిలవవు
- తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి
రంగారెడ్డి:
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర పాలకుల మెప్పు పొందేందుకే సీబీఐ 'అప్పీల్ డ్రామాలు' ఆడుతోందని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితపై అబద్ధపు కేసులు మోపారని, ఇవి కోర్టుల్లో నిలవవని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కోర్టు తీర్పు చెంపపెట్టు
మూడేళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు.. కవితపై ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెబుతూ కేసును కొట్టేసిందని పాండురంగారెడ్డి గుర్తు చేశారు. "కేసు కొట్టేయడమే కాకుండా, తప్పుడు విచారణ జరిపిన సీబీఐ అధికారిపైనే విచారణకు ఆదేశించడం ఆ సంస్థకు చెంపపెట్టు వంటిది. గతంలో ఫోన్లు ధ్వంసం చేశారని అసత్య ప్రచారం చేసిన సీబీఐ.. ఆమె స్వయంగా ఫోన్లను కోర్టుకు సమర్పించడంతో అభాసుపాలైంది" అని ఎద్దేవా చేశారు.
చిన్న నోటీసు ఇవ్వడానికి కూడా ఢిల్లీ నుంచి అధికారులు రావడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనని పాండురంగారెడ్డి ఆక్షేపించారు. స్థానిక సిబ్బందితో చేయించాల్సిన పనులకు కూడా స్పెషల్ టీమ్స్ రావడం కేవలం మీడియాలో హడావుడి సృష్టించేందుకేనని విమర్శించారు.
సీబీఐ, ఈడీల విశ్వసనీయతపై గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. "వందల మందిని విచారించినా రౌస్ అవెన్యూ కోర్టులో నిలవని ఆధారాలు, హైకోర్టులో నిలుస్తాయనుకోవడం భ్రమ. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. కవిత నిష్కళంకమైన నాయకురాలిగా బయటకు వస్తారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
