కరీంనగర్ 'నల్ల' గ్రానైట్.. దర్యాప్తులో ఈడీ నత్తనడక!
- ₹750 కోట్ల స్కామ్.. ఏళ్లు గడిచినా తేలని విచారణ
- ఈడీ సోదాలు ఉత్తుత్తివేనా? మైనింగ్ మాఫియా వెనుక ఎవరు?
- మౌన ముద్రలో కేంద్ర మంత్రి.. ఏజెన్సీలపై మమకారం ఎందుకు?
- (కరీంనగర్ ప్రతినిధి దారం.జగన్నాథ రెడ్డి)
కరీంనగర్ ఏప్రిల్ 16 భారత శక్తి:
కరీంనగర్ జిల్లాలో పచ్చని గుట్టలను పిండి చేస్తున్న గ్రానైట్ మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నిలువునా ధ్వంసం చేస్తున్నా.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ (ED), సీబీఐ (CBI)ల తీరు ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. దశాబ్ద కాలంగా విచారణల పేరుతో కాలయాపన చేయడం, నోటీసులకే పరిమితం కావడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏమిటా ₹750 కోట్ల కుంభకోణం?
2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కరీంనగర్ గ్రానైట్ దోపిడీపై సంచలన నివేదిక ఇచ్చింది. కాకినాడ వంటి ప్రధాన ఓడరేవుల ద్వారా ఎటువంటి అనుమతులు (Transit Permits) లేకుండా, సినరేజి ఫీజులు చెల్లించకుండా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ విదేశాలకు తరలిపోయింది.
అక్రమ రవాణా: దాదాపు 7.68 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా తరలించారు.
*విధించిన పెనాల్టీ: నార్మల్ సినరేజి ఫీజు రూ. 125 కోట్లు కాగా, ఐదు రెట్లు పెనాల్టీతో కలిపి మొత్తం *రూ. 749.66 కోట్లు* చెల్లించాలని 126 మంది క్వారీ యజమానులకు నోటీసులు ఇచ్చారు.
ఈడీ సోదాలు.. పబ్లిసిటీ స్టంట్లా?
2022 నవంబర్‌లో ఈడీ అధికారులు కరీంనగర్, హైదరాబాద్‌లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై మెరుపు దాడులు చేశారు. అప్పట్లో ఈడీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ఎన్నో ఆశలు కల్పించింది.
బినామీ ఖాతాల గుట్టు: ఉద్యోగుల పేర్లతో బినామీ ఖాతాలు తెరిచి హవాలా మార్గంలో డబ్బు మళ్లించినట్లు గుర్తించారు.
చైనా లింకులు: పనామా లీక్స్‌లో ఉన్న చైనా కంపెనీల నుంచి నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు.
స్వాధీనం: రూ. 1.08 కోట్ల నగదుతో పాటు 10 ఏళ్ల డేటాను సీజ్ చేశారు.
ఇంతటి పక్కా ఆధారాలు దొరికినప్పటికీ, ఏడాదిన్నర దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం విడ్డూరం. 'ఫెమా' (FEMA) ఉల్లంఘనలు జరిగాయని చెప్పిన ఈడీ.. ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రానైట్ మాఫియాపై నిప్పులు చెరిగిన నేతలు.. నేడు అధికారం చేతిలో ఉన్నా పెదవి విప్పడం లేదు. ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గతంలో మైనింగ్ అక్రమాలపై అప్పటి కేంద్ర మంత్రికి ఫిర్యాదులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, తన కళ్ల ముందే జరుగుతున్న అక్రమాలపై మౌనంగా ఉండటం మాఫియాకు కొమ్ముకాయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రకృతి విధ్వంసానికి బదులెవరు?
విచారణ దశలోనే ఉందని అధికారులు కాలక్షేపం చేస్తుంటే, అక్కడ కొండలు కరిగి మైదానాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తవ్వకాల వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ ముప్పు పొంచి ఉంది. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఇకనైనా స్పందించి, ఆ ₹750 కోట్ల బకాయిలను వసూలు చేయడంతో పాటు, దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఈ విచారణలు కేవలం పాలకుల ప్రయోజనాల కోసమే అన్న అపవాదు మిగిలిపోక తప్పదు.
