అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
భద్రాద్రి కొత్తగూడెం :
- కోడిపందాలు, పేకాట, బెట్టింగులపై ఉక్కుపాదం మోపాలి
- రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి.
- ఎస్పీ రోహిత్ రాజు

కోడిపందాలు, పేకాట, బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.
మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు దుమ్ముగూడెం, బూర్గంపాడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిత్యం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచి దొంగతనాల కట్టడికి కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతీ ప్రదేశంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్దాలను అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సేవించే ప్రదేశాలను గుర్తించి, నిత్యం అట్టి ప్రదేశాలలో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.
