కృష్ణమ్మ పరవళ్ల కోసం కదలిరండి!

  • నేడు చౌదర్‌గూడలో ‘పాలమూరు-రంగారెడ్డి’ సాధన సభ
  •  ప్రాజెక్టు పనుల పరిశీలనలో తెలంగాణ రక్షణ సేన నేతలు
  • దక్షిణ తెలంగాణకు సంజీవని ఈ ఎత్తిపోతల పథకం
  • రైతులు, యువత భారీగా తరలిరావాలని పిలుపు

కృష్ణమ్మ పరవళ్ల కోసం కదలిరండి!

హైదరాబాద్:

దక్షిణ తెలంగాణ బీడు భూములకు జీవం పోసి, ఈ ప్రాంత రూపురేఖలను మార్చగల ఏకైక సంజీవని ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకమని తెలంగాణ రక్షణ సేన నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో గురువారం మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన "సాధన సభ" ఏర్పాట్లను పార్టీ ముఖ్య నేతలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సభా స్థలి వద్ద మీడియాతో మాట్లాడారు.

ఎండిన భూములకు సాగునీరే ప్రాణాధారం
ఎండిన బీడు భూములను సస్యశ్యామలం చేసి, రైతాంగం బతుకుల్లో వెలుగులు నింపేందుకు సాగునీరే ప్రధాన మార్గమని నేతలు స్పష్టం చేశారు. మన పొలాలకు దక్కాల్సిన నీటి వాటా కోసం, భవిష్యత్తు తరాల బాగు కోసం ప్రజలంతా ఏకమై ఈ సభలో గొంతు కలపాలని కోరారు. ముఖ్యంగా యువత ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలవాలని, ప్రాజెక్టు పూర్తయితేనే వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

మహిళల తాగునీటి కష్టాలకు విముక్తి
ప్రాజెక్టు సాకారమైతేనే గ్రామాల్లో తాగునీటి గోస తీరుతుందని, ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. "మన నీటి హక్కు.. మన భవిష్యత్తు.. మన బాధ్యత" అనే నినాదంతో సాగుతున్న ఈ పోరాటంలో మహిళలు, మేధావులు, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ముమ్మరంగా ఏర్పాట్లు
సభను మహా విజయం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు కదలిరావాలని కోరారు. సభా స్థలిని పరిశీలించిన వారిలో తెలంగాణ రక్షణ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, నారాయణపేట అధ్యక్షుడు గవినోళ్ళ శ్రీనివాస్, షాద్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ చీమల రమేష్‌ ఉన్నారు. వీరితో పాటు సమన్వయకర్తలు చిలుక ప్రవీణ్, శీలం వీరేందర్, చామర్తి శీతారామ్, నాయకులు శ్యామ్, శ్రవణ్ గౌడ్, శివరామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author