ఎల్బీనగర్ పాత గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం
- రూ. 1.78 కోట్లతో మౌలిక వసతుల కల్పన
- ప్రజల ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం: మల్‌రెడ్డి రాంరెడ్డి.
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పాత గ్రామం (ఓల్డ్ విలేజ్) రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ. 1.78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పునాది వేశారు. మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డిలతో కలిసి ఆయన పనులను ప్రారంభించారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి:
ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ ప్రాంతంలో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నాణ్యతతో కూడిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత డివిజన్ వ్యాప్తంగా భారీ నిధులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, బస్తీలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో చంపాపేట్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, నాయకులు జానీ భాయ్, గణేష్ గౌడ్, రవి చారి, సతీష్, సత్తి, గోపి, రాజేశ్వరి, వికాస్, ప్రకాష్ యాదవ్, శ్రీకాంత్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బస్తీ వాసులు పాల్గొన్నారు.
