మే 24 న ఎల్బీనగర్ ఎస్ కే గార్డెన్ లో బీసీ ప్రభంజనం
- తెలంగాణ బీసీ ప్రభంజనం
- కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ
ఎల్బీనగర్:
జనాభా దామాషా ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మన్సురాబాద్ డివిజన్లో జరిగిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో అవకాశం లేకపోవడంతో అర్హతలు ఉండి కూడా చాలా మంది బీసీ నేతలు అగ్రవర్ణాల వారితో పోటీ పడలేక పోతున్నారని, జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేయడానికి సాహసం చేయకపోవడంతో మెజారిటీ స్థానాల్లో అన్ని ప్రధాన పార్టీలు అగ్రవర్ణాల వారికే టిక్కెట్లు కేటాయిస్తున్నారని ఆయన వివరించారు. జనాభాలో 65 నుంచి 70 శాతం ఉన్న బీసీలకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కనీసం చట్టసభల్లో పోటీ చేయడానికి రిజర్వుడు స్థానాలు ఉన్నాయని సత్యనారాయణ తెలిపారు. కొంతమేరకు అయినా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు చట్టసభల్లో వెళ్లడానికి రిజర్వుడు స్థానాలు అవకాశం కల్పిస్తున్నాయని, పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వుడు స్థానాలు లేవని కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లో అయిన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ ప్రభంజనం సృష్టిస్తోంది
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని మహా హైదరాబాద్ కార్పొరేషన్ మూడు కార్పోరేషన్లు అయ్యాయని బీసీ ప్రభంజనం సమన్వయకర్త టియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు జాల కిషన్ తెలిపారు. ఈ మూడు కార్పోరేషన్ల ఎన్నికల్లో బీసీలకు యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కేటాయించాలని, ప్రభుత్వం ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారమే మూడు వందల డివిజన్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధతపై అన్ని పార్టీలు సహకరించాలని కిషన్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ ప్రభంజనం నిర్వహిస్తున్నట్లు కిషన్ తెలిపారు. మే 24 న ఆదివారం ఉదయం పది గంటలకు ఎల్బీనగర్ ఎస్ కే గార్డెన్ లో బీసీ ప్రభంజనం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ ప్రభంజనం సభకు అన్ని రాజకీయ పార్టీల నుంచి అఖిల పక్ష బీసీ నాయకులు, బీసీ విద్యావంతులు, మేధావులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారని ఆయన వివరించారు. బీసీ ప్రభంజనం సభకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు దళిత సంఘాలు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే ఎల్బీనగర్ ప్రాంతంలో బీసీ ప్రభంజనం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ వెంకన్న
తెలంగాణ ఉద్యమంలో బీసీల త్యాగంతో రాష్ట్ర సాధన సాధ్యమైందని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ వెంకన్న అన్నారు. బీసీ ప్రభంజనం సభకు తెలంగాణ వెంకన్న ఈ సందర్భంగా మద్దతు ప్రకటించారు. ఎల్బీనగర్ కేంద్రంగా సాగిన మలిదశ ఉద్యమంలో బీసీ వర్గానికి చెందిన శ్రీకాంత్ చారి, సిరిపురం యాదయ్యల ప్రాణ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని వెంకన్న అభిప్రాయపడ్డారు. ఎల్బీనగర్ లో జరిగే బీసీ ప్రభంజనం సభ నిజంగానే తెలంగాణలో ప్రభంజనం సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు బొంగు వెంకటేష్ గౌడ్, శ్యామ్ యాదవ్, ఉపేంద్ర యాదవ్, తానాజీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రభంజనం సభకు దళిత గిరిజన బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా తరలి రావాలని బీసీ ప్రభంజనం నాయకులు విజ్ఞప్తి చేశారు.
