సోమయ్యపై అసత్య ప్రచారాలు తగవు
- జర్నలిస్టు వర్గాల ఆగ్రహం
- టీడబ్ల్యూజేఎఫ్ విభజనపై విమర్శలు
*హైదరాబాద్:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్యపై బసవపున్నయ్య చేస్తున్న ఆరోపణలను జర్నలిస్టు వర్గాలు తీవ్రంగా ఖండించాయి. సోమయ్యపై వ్యక్తిగత ద్వేషంతోనే అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని పలువురు పాత్రికేయులు మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం వేలాది మంది జర్నలిస్టులను అయోమయానికి గురి చేయడం సరికాదని హితవు పలికారు.
సంఘం విచ్ఛిన్నానికి కారకులెవరు?
రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతకు మారుపేరుగా ఉన్న టీడబ్ల్యూజేఎఫ్ రెండు వర్గాలుగా చీలిపోవడానికి గల అసలు కారణాలు రాష్ట్ర పాత్రికేయ సమాజానికి తెలుసని జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన సంఘంలో "నేనే నడిపిస్తున్నా" అనే ధోరణితో వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. ఒకే వర్గానికి పెద్దపీట వేస్తూ, ఇతరులను విస్మరించడాన్ని ప్రశ్నించినందుకే వ్యవస్థాపకులను అవమానించడం, బహిష్కరణల పేరుతో డ్రామాలు ఆడటం నైతికంగా, చట్టపరంగా చెల్లదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా దూషణలకు దిగడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
గత మూడు దశాబ్దాలుగా చిన్న పత్రికలు, కేబుల్ ఛానళ్లు, డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల కోసం మామిడి సోమయ్య నిరంతర పోరాటం చేస్తున్నారని జర్నలిస్టులు పేర్కొన్నారు.
* అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం అనేక ధర్నాలు నిర్వహించారు.
* సమాచార భవన్ వద్ద నిరసనలు, ప్రభుత్వ అధికారులతో చర్చలతో పాటు హైకోర్టులో న్యాయపోరాటం చేసిన చరిత్ర ఆయనకుంది.
* పెద్ద పత్రికల వారికే పరిమితమవుతున్న రాయితీలను గ్రామీణ విలేకరులకు, చిన్న మీడియా సంస్థలకు దక్కేలా చేయడంలో సోమయ్య కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఆత్మపరిశీలన చేసుకోవాలి
పదేళ్ల పాటు మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా పదవులు అనుభవించిన బసవపున్నయ్య.. చిన్న జర్నలిస్టుల సమస్యలపై ఎన్నిసార్లు గళమెత్తారని జర్నలిస్టులు ప్రశ్నించారు. పదవుల కోసం, రాజకీయ లబ్ధి కోసం సోమయ్య ఎన్నడూ పాకులాడలేదని, జర్నలిస్టుల హక్కులే ధ్యేయంగా పనిచేస్తున్నందుకే వేలాది మంది ఆయన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జర్నలిస్టుల సంక్షేమమే ముఖ్యమని భావించే నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జర్నలిస్టు ప్రతినిధులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
