నా ఎదుగుదలలో మీడియా పాత్ర మరువలేనిది – కాల్వ నరేష్

- రెండోసారి దుబ్బాక పాక్స్ వైస్ చైర్మన్‌గా ఎన్నిక

నా ఎదుగుదలలో మీడియా పాత్ర మరువలేనిది – కాల్వ నరేష్

సిద్దిపేట:
దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) వైస్ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన కాల్వ నరేష్ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ మీడియా పాత్రను ప్రశంసించారు.విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన తన ప్రయాణం నేడు ఈ స్థాయికి చేరుకోవడంలో పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల మద్దతు కీలకమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకునిగా, దళిత సంఘాల ప్రతినిధిగా పనిచేసిన రోజులను ఆయన స్మరించుకున్నారు. ఆ సమయంలో పోలీసుల దాడులు ఎదుర్కొన్నానని, జైలు జీవితాన్ని కూడా అనుభవించానని తెలిపారు. ఆ కష్టకాలంలో మీడియా తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.
సిద్దిపేట కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులు తన కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపారు.

గురువును స్మరించిన నరేష్

సిద్దిపేటలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో తనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ స్వర్గీయ నాగరాజును ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ప్రతి సమస్యలో తనకు మార్గనిర్దేశం చేసిన నాగరాజు లేకపోవడం బాధాకరమని తెలిపారు. “పీఏసీఎస్ వైస్ చైర్మన్‌గా రెండోసారి సంతకం చేసే వేళ ఆయన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి… నాగన్న, ఐ మిస్ యూ” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, రైతు సేవలో మరియు ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తానని కాల్వ నరేష్ తెలిపారు.

About The Author