గీతం సైన్స్ కోర్సుల అడ్మిషన్ల కోసం మే 17న ప్రవేశ పరీక్ష
పటాన్‌చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం మే 17న గీతం అడ్మిషన్ టెస్ట్ (గాట్-2026, మూడో దశ)ను నిర్వహించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 14వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్ లైన్లో సమర్పించవచ్చని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రెజా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
యూజీసీ గుర్తింపుతో పాటు నాక్ ఏ++ గ్రేడ్ తో అక్రిడిటేషన్ పొందిన స్కూల్ ఆఫ్ సైన్స్ అంతర్ విభాగ విద్య, అధునాతన పరిశోధనలకు ఒక అగ్రగామి కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ప్రపంచవ్యాప్త అనుభవం కలిగిన అనుభవజ్జులైన అధ్యాపకుల మద్దతుతో, ఆవిష్కరణ, డీప్-టెక్ పరిశోధన, వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఒక చైతన్యవంతమైన విద్య వాతావరణాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ అందిస్తోందని తెలిపారు.
ఇక, పీజీ స్థాయిలో, బయెటెక్నాలజీ, కెమిస్ట్రీ (అనలిటికల్, ఆర్గానిక్, ఫార్మాస్యూటికల్ స్పెషలైజేషన్లు), డేటా సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్ (మెటీరియల్ సైన్స్)లో రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు. ఫెలోషిప్ మద్దతుతో కూడిన ఫుల్-టైమ్ పీహెచ్.డీ. కోర్సులు కూడా పలు విభాగాలలో అందుబాటులో ఉన్నాయన్నారు.
ఐఐటీ, సీఎస్ఐఆర్, బాబా అణు పరిశోధనా సంస్థ, డీఆర్డీవో వంటి ప్రముఖ సంస్థలతో పాటు డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో బలమైన సహకారాలను కొనసాగిస్తూ, పటిష్టమైన పరిశోధనా అవకాశాలను, ప్రాంగణ నియామకాలను అందిస్తున్నట్టు ఆయన వివరించారు. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉపకార వేతనాల (స్కాలర్ షిప్పులు)ను అందిస్తున్నామన్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో పొందిన చెల్లుబాటయ్యే స్కోరుతో నేరుగా మే 17న వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని తెలిపారు.
దరఖాస్తులు, ఇతర వివరాల కోసం www.gitam.eduను సందర్శించాలని లేదా హెల్ప్ లైన్ 888 498 4000ను సంప్రదించాలని డాక్టర్ రెజా సూచించారు.
