అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంచిరెడ్డి డ్రామాలు

  • * 15 ఏళ్లు పట్టించుకోని లష్కర్ గూడ బ్రిడ్జిపై ఇప్పుడు సడన్ ప్రేమా?
  • *మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై మండిపడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సి.హెచ్ భాస్కరాచారి, కాంగ్రెస్ నేతలు

అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంచిరెడ్డి డ్రామాలు

అబ్దుల్లాపూర్ మెట్టు:

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లష్కర్ గూడలో సర్కస్ ఫీట్లు చేస్తున్నారని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్. భాస్కర్ చారి అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధుసూదన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసినట్లే, ఇబ్రహీంపట్నం ప్రజలు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇంటికే పరిమితం చేశారని గుర్తుచేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కేవలం మల్‌రెడ్డి రంగారెడ్డితోనే సాధ్యమని నమ్మి ప్రజలు కిషన్ రెడ్డిని ఓడించారన్నారు. నియోజకవర్గంలో ఉనికి చాటుకునేందుకే లష్కర్ గూడలో కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లష్కర్ గూడ, మజీద్ పూర్, సంఘీ, ఇంజాపూర్, పెద్ద అంబర్ పేట్ బ్రిడ్జిల సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. 2021 భారీ వర్షాలకు బ్రిడ్జిలు కూలిపోతే అప్పుడు పట్టించుకోకుండా, ఇప్పుడు కేవలం లష్కర్ గూడ బ్రిడ్జిని బూచిగా చూపిస్తూ రాజకీయం చేయడం సరికాదన్నారు.

*ఆలయాలపై రాజకీయ రంగు పులమడం నీచం: భాస్కర్ చారి
సమావేశ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు సిహెచ్. భాస్కర్ చారి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తన సొంత నిధులతో తొర్రూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడితే, దానిపై కూడా కిషన్ రెడ్డి రాజకీయ రంగు పులమడం ఆయన నీచ సంస్కృతికి అద్దం పడుతోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిల చొరవతో కోహెడలో 179 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. పాత స్థలాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కేటాయించామని స్పష్టం చేశారు.

*అభివృద్ధి పథంలో ఇబ్రహీంపట్నం
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని నేతలు పేర్కొన్నారు. అనాజ్ పూర్ గ్రామం నుండి ఘట్కేసర్ వరకు రోడ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రూ. 29 కోట్ల ప్రోసిడింగ్స్ కాపీలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి అభివృద్ధిని కేవలం శిలాఫలకాలకే పరిమితం చేశారని, కానీ మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిచిన తర్వాతే సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
ఈ సమావేశంలో అబ్దుల్లాపూర్ మెట్టు సర్పంచుల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచులు విజయ శ్రీశైలం గౌడ్, ఐలయ్య, జంగయ్య, వెంకటేష్, మాజీ సర్పంచులు ఏళ్ల బాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంతటి ఊశయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author