స్ట్రామ్ వాటర్ నాలా పనులను వెంటనే నిలిపివేయాలి
సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల ధర్నా
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ ప్రాంతంలో జనప్రియ అపార్ట్మెంట్స్ పక్కన భాగంలో జిహెచ్ఎంసి అధికారుల కనుసన్నల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు చేపడుతున్న స్ట్రామ్ వాటర్ నాలా డైవర్షన్ పనులను వెంటనే నిలిపివేయాలని బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజలతో కలిసి,ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసనతో కూడిన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొని లింగోజిగూడ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నేత, మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన స్ట్రామ్ వాటర్ నాలాను కొందరు ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ నాలా డైవర్షన్ కారణంగా లింగోజిగూడ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో భారీ ముంపు సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న నాలా డైవర్షన్ పనులను వెంటనే నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న నాలాను యథాతథంగా కొనసాగిస్తూ డీసిల్టేషన్ పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) కార్తీక్ ని కలిసి వినతిపత్రం అందజేశారు.దీనిపై స్పందించిన ఈఈ కార్తీక్, జరుగుతున్న నాలా పనులకు సంబంధించి వెంటనే నోటీసులు జారీ చేసి పనులను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్న నాలాలో డీసిల్టేషన్ పనులను కూడా అత్యవసరంగా ప్రారంభిస్తామని సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, లింగోజిగూడ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
