ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం: ‘తీరు మారకుంటే బాంబుల వర్షమే!’
- అది కేవలం ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమే.. ఫైనల్ కాదు!
- *పునర్నిర్మాణ నిధుల వార్తల్లో నిజం లేదు.. ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు!
- *అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.
వాషింగ్టన్/టెహ్రాన్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆ దేశంపై మళ్లీ బాంబు దాడులు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్‌తో తాము జరుపుతున్న చర్చలు, చేసుకోబోయే ఒప్పందాలు కేవలం ప్రాథమిక అవగాహన (అండర్‌స్టాండింగ్) కోసమేనని, అది ఎంతమాత్రం అంతిమ (ఫైనల్) ఒప్పందం కాదని ఆయన తేల్చిచెప్పారు. ఒప్పందంలో పొందుపరిచే అంశాలు తనకు నచ్చకపోయినా, లేదా ఇరాన్ తన దూకుడు స్వభావాన్ని మార్చుకోకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
*ఆ నిధుల వార్తల్లో నిజం లేదు!
అమెరికా-ఇరాన్ ఒప్పందంలో భాగంగా, ఇరాన్ పునర్నిర్మాణ నిధుల (రికాన్స్ట్రక్షన్ ఫండ్స్) కింద టెహ్రాన్‌కు అమెరికా సుమారు 300 బిలియన్ డాలర్లు సమకూర్చనుందనే వార్తలను అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. "ఇరాన్ కోసం మేం ఒక్క పైసా కూడా వెచ్చించడం లేదు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి మా దగ్గర ఎలాంటి ప్రత్యేక నిధులు లేవు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టాలని తాము గల్ఫ్ దేశాలను కోరడం లేదని, అయితే ఒకవేళ ఆయా దేశాలు సొంతంగా ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. కానీ, ఇరాన్ భవిష్యత్తు ధోరణి మరియు విశ్వసనీయతపై పూర్తి అవగాహన వచ్చే వరకు గల్ఫ్ దేశాలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టే సాహసం చేయకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్ వ్యవహారశైలిపైనే అంతర్జాతీయ సమాజం దృష్టి సారించిందని, అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగితే సహించేది లేదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
