సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం:

ఎల్బీనగర్ డీసీపీ డాక్టర్ బి. అనురాధ ఐపిఎస్ సూచనలు

సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం:

ఎల్బీనగర్:

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత ముఖ్యమని ఎల్బీనగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ బి. అనురాధ పేర్కొన్నారు. సమాజాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీ  సురక్ష’ అవగాహన కార్యక్రమానికి డీసీపీ డాక్టర్ బి. అనురాధ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఇటీవల నగరంలోని పలు అపార్ట్‌మెంట్లు, నివాస గృహాల్లో చోటుచేసుకుంటున్న చోరీలు, హత్యలు వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే నెల నుంచి ‘మీ సురక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, నివాస ప్రాంతాల్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, హౌస్ కీపింగ్ సిబ్బంది, గృహ సహాయకులు, డ్రైవర్లు తదితర సేవకుల వివరాలను సేకరిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఇప్పటి వరకు ప్రజల సహకారంతో 2223 మంది పోలీసుల ద్వారా 9,940 మంది సేవకుల వివరాలను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమాచారంతో ఏదైనా నేర ఘటన జరిగినప్పుడు అనుమానితులను గుర్తించడం, దర్యాప్తు వేగవంతం చేయడం, నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు.ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన డీసీపీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మహిళలపై వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తుల సంచారం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే సమాచారం నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.ప్రస్తుతం సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌లు లేదా వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని సూచించారు. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని అనేక మంది ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ క్రమశిక్షణ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తగిన జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ కోటేశ్వరరావు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, నాగోల్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ, పలువురు సీఐలు, ఎస్సైలు, షీ టీం సిబ్బంది, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ప్రజల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, సురక్షితమైన, నేరరహిత సమాజ నిర్మాణం అందరి సహకారంతోనే సాధ్యమవుతుందని డీసీపీ డాక్టర్ బి. అనురాధ స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమం ప్రజల్లో భద్రత, సైబర్ జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాల పట్ల చైతన్యం పెంపొందించడంలో ఉపయోగపడిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

About The Author