ప్రైవేటు బడి దోపిడీ..
విద్యా అధికారుల అండదండలు!
- * పుస్తకాలు, దుస్తుల పేరిట ప్రైవేట్ స్కూళ్ల దందా
- * నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ యంత్రాంగం
- * లంచాల మత్తులో క్షేత్రస్థాయి పరిశీలనలు శూన్యం..!
- ఫీజు నియంత్రణ కమిటీ ఎక్కడ: విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి ఈ దోపిడీని అరికట్టాలి..!
- * అవినీతి నిరోధక శాఖ నిఘా పెట్టాలని తల్లిదండ్రుల డిమాండ్..!
సొసైటీలో తమ "స్థాయి"ని ప్రదర్శించుకోవడానికి మధ్యతరగతి తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ల బ్రాండ్ల వెంట పడటం నేడు ఒక సామాజిక జాడ్యంగా మారింది. పిల్లవాడి చదువు జ్ఞానార్జన కోసం కాక, పక్కింటివారితో పోటీ పడే ఒక అహంకార ప్రదర్శనగా రూపాంతరం చెందింది. తల్లిదండ్రుల ఈ భయాన్ని, బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థలు అక్షరాలా వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నాయి. స్కూల్ ఫీజుల పేరిట జేబులు గుల్ల చేయడమే కాకుండా, యూనిఫారాలు, పుస్తకాలు, బెల్టుల వరకు తామే విక్రయిస్తూ గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. విద్యాహక్కు చట్టాలను, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, 'లాభాపేక్ష లేని సేవ'గా ఉండాల్సిన విద్యను అత్యంత లాభదాయకమైన కార్పొరేట్ దోపిడీ కేంద్రాలుగా మార్చేశారు. ఈ హోదా భ్రమల వెనుక మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.
(పరిశోధనాత్మక పాత్రికేయులు.. ఎం.వేణుగోపాల్ రెడ్డి.. మీ "వి.జీ..):
హైదరాబాద్:
*సిండికేట్ సామ్రాజ్యం.. ఐదింతల ధరలు!
కేంద్ర విద్యా బోర్డు (సీ.బీ.ఎస్.ఈ) స్పష్టమైన ఆదేశాల ప్రకారం.. ఏ పాఠశాల ప్రాంగణంలోనూ ఎలాంటి వాణిజ్యపరమైన విక్రయాలు జరపకూడదు. విద్యార్థులు తమకు నచ్చిన చోట పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసే స్వేచ్ఛను కల్పించాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
నిర్దేశిత దుకాణాల దందా: ఫలానా దుకాణంలోనే వస్తువులు కొనాలంటూ పాఠశాలల యాప్‌లు, సామాజిక మాధ్యమాల (వాట్సాప్) గ్రూపుల ద్వారా హుకుం జారీ చేస్తున్నారు. మార్కెట్ ధర కంటే 3 నుండి 4 రెట్లు అధికంగా వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
కాగితాలకే పరిమితమైన ఫీజు నియంత్రణ
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీ వేసినా, జీవో నెంబర్ 46 తీసుకొచ్చినా.. అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. పొరుగు రాష్ట్రాల తరహాలో ఇక్కడ ఒక శాశ్వత, స్వతంత్ర ఫీజు నియంత్రణ కమిటీ (FRC) లేకపోవడం ప్రైవేట్ యాజమాన్యాలకు వరంగా మారింది. ఏటా 10 నుండి 20 శాతం మేర ఫీజులు పెంచుకుంటూ పోతున్నా విద్యాశాఖ కనీస నోటీసులు కూడా జారీ చేయడం లేదు.
లంచాల మత్తులో విద్యాశాఖ.. ఏసీబీ తనిఖీలు అనివార్యం!
ఈ మొత్తం దందా వెనుక మండల విద్యాధికారులు (MEOs), జిల్లా విద్యాధికారుల (DEOs) పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. పాఠశాలల గుర్తింపు (రికగ్నిషన్) మరియు వార్షిక తనిఖీల సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లకుండానే, ఏసీ గదుల్లో కూర్చొని అనుమతులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నిబంధనల ఉల్లంఘనలు ఇవే:
అగ్నిమాపక అనుమతులు (Fire Safety): వందలాది విద్యార్థులుండే భవనాలకు కనీస అగ్నిమాపక రక్షణ లేకపోయినా నివేదికలు అనుకూలంగా మారుతున్నాయి.
ఆటస్థలాలు (Playgrounds): కనీస ఆటస్థలం లేని అపార్ట్‌మెంట్ స్కూళ్లకు సైతం ఏటా గుర్తింపులు లభిస్తున్నాయి.
*ఉచిత విద్యకు పాతర: విద్యా హక్కు చట్టం (RTE-2009) ప్రకారం పేద విద్యార్థులకు కేటాయించాల్సిన 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను పూర్తిగా తుంగలో తొక్కారు.
ఈ అక్రమాలపై కేవలం విద్యాశాఖ అంతర్గత విచారణలు సరిపోవని, ప్రతి మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రత్యేక నిఘా విభాగాలను రంగంలోకి దించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల ఆస్తులపై, పాఠశాలల నుండి అందుతున్న ముడుపులపై సమగ్ర విచారణ జరిపితేనే ఈ 'బడి దోపిడీ'కి అడ్డుకట్ట పడుతుందని తల్లిదండ్రుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
