టీఆర్ఎస్ పేరును పునరుద్ధరిస్తేనే బి.ఆర్.ఎస్ పార్టీకి మనుగడ..

  • బీఆర్ఎస్ వైఖరిపై ఓయూ విద్యార్థులు, గ్రామీణ ప్రజల తీవ్ర అసంతృప్తి.
  • *పేరు మార్చకుంటే కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికే ప్రమాదం.
  • *కల్వకుంట్ల కవితక్క దారిలోనే నడిచి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’కి జీవం పోయాలి: అల్లంపల్లి రామకోటి.. 

టీఆర్ఎస్ పేరును పునరుద్ధరిస్తేనే బి.ఆర్.ఎస్ పార్టీకి మనుగడ..

హైదరాబాద్:

తెలంగాణ సాధించిన ఘన చరిత్ర, ఎందరో అమరవీరుల త్యాగాలు దాగి ఉన్న 'టీఆర్ఎస్' (TRS) పేరును 'బీఆర్ఎస్' (BRS) గా మార్చడం ద్వారా పార్టీ తన ఉనికిని, ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

*ఉద్యమ త్యాగాలను స్మరిస్తూ..
మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత చేసిన అసమాన త్యాగాలను రామకోటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నాటి విద్యావ్యవస్థలు స్తంభించి, యువత ఉపవాస దీక్షలతో రోడ్లపైకి వచ్చిన రోజులను ప్రస్తావించారు. యూనివర్సిటీల చుట్టూ ఇనుప కంచెలు వేసి, భారీ పోలీస్ బందోబస్తుతో ఆంక్షలు విధించినప్పటికీ... ఆ అడ్డంకులను ఛేదించుకుని జైళ్లకైనా సిద్ధమంటూ విద్యార్థులు పోరాడారని తెలిపారు. ఆనాడు యువత అంతా ప్రాణాలకు తెగించి పోరాడింది 'టీఆర్ఎస్' గులాబీ జెండా నీడలోనే అని ఆయన స్పష్టం చేశారు.

"బీఆర్ఎస్ అనే అస్తిత్వం లేని పేరుతో ముందుకు వెళ్లడం వల్ల నాటి ఉద్యమ త్యాగాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ఇవాళ స్వార్థం కోసం పార్టీ పేరు మార్చిన వారు, రేపు రాష్ట్రం పేరు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రజలు భావిస్తున్నారు."
*అల్లంపల్లి రామకోటి

*కవిత నేతృత్వంలో పునర్జీవం
టీఆర్ఎస్ పేరుకు పూర్వ వైభవం తెచ్చి, దానికి పునర్జీవం పోయడానికి కల్వకుంట్ల కవిత ముందుకు వస్తున్న తరుణంలో, ఉద్యమ శ్రేణులంతా ఆమె దారిలో నడిచి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని రామకోటి పిలుపునిచ్చారు. అందరూ ఐకమత్యంతో ‘టీఆర్ఎస్’కు మళ్లీ జీవం పోస్తేనే తెలంగాణ ప్రజల్లో సరికొత్త ఉత్సాహం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

*మార్పు లేకుంటే కాలగర్భంలోకే..
కేసీఆర్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని రామకోటి హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్ గా మార్చకపోతే రాబోయే రోజుల్లో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. పేరు మార్చుకోకపోతే కేసీఆర్ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని, ఒక సాధారణ కార్యకర్త కంటే కింది స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పేరు మార్చని పక్షంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, అమరవీరుల త్యాగాలకు గౌరవం ఇవ్వడానికి తక్షణమే ‘టీఆర్ఎస్’ పేరును పునరుద్ధరించాలని రామకోటి డిమాండ్ చేశారు.

About The Author