కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే సొంతింటి కలకు సాకారం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

  • రెండో విడతలో మరో 2,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు
  • రూ.21 వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ
  • కోటపల్లి ప్రాజెక్టు పనులు వేగంగా.. 9,500 ఎకరాలకు సాగునీరు లక్ష్యం
  • ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
  • మీడియాతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే సొంతింటి కలకు సాకారం: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

వికారాబాద్:

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోనే 
 పేదోడి సొంతింటి కల సాకారమైందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని, పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు నిజమైన సంక్షేమం అందుతోందని పేర్కొంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోందన్నారు.WhatsApp Image 2026-06-01 at 21.12.48 (5)
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా రూ.21 వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ అమలు చేసి లక్షలాది మంది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిందన్నారు.
రైతులు అప్పుల బాధల నుంచి బయటపడి వ్యవసాయంపై దృష్టి సారించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపిస్తూ, భారీ అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని విమర్శించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదన్నారు.
కోటపల్లి ప్రాజెక్టు కింద 14 గ్రామాలకు చెందిన సుమారు 9,500 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. మరో రెండు నుంచి మూడు నెలల్లో కెనాల్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని, మరో వారం నుంచి పది రోజుల్లో రెండో విడతగా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పి. మైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, మల్లేశం, టీపీసీసీ మైనార్టీ కన్వీనర్ రియాజ్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుWhatsApp Image 2026-06-01 at 21.12.48 (4)

About The Author