అర్ధరాత్రి దారుణం: ఈస్ట్ మారేడ్‌పల్లిలో యువకుడి దారుణ హత్య!

పాత కక్షల నేపథ్యంలో కత్తితో పొడిచి చంపిన వైనం.. 24 గంటల్లోనే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

అర్ధరాత్రి దారుణం: ఈస్ట్ మారేడ్‌పల్లిలో యువకుడి దారుణ హత్య!

మారేడ్పల్లి: 

మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈస్ట్ మారేడ్‌పల్లి పరిధిలోని సంజీవయ్య నగర్‌లో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

*అసభ్య ప్రవర్తన.. నిలదీసినందుకు ఘర్షణ!

పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 31వ తేదీ రాత్రి సుమారు 11:45 గంటల సమయంలో సంజీవయ్య నగర్‌కు చెందిన కౌసల్య పరశురామ్ కుమార్తె కె. దీపిక ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తుండగా, అదే ప్రాంతానికి చెందిన పంగా నిఖిల్ అనే యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై దీపిక తండ్రి పరశురామ్ నిఖిల్‌ను నిలదీయడంతో అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అనంతరం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన పరశురామ్ కుమారుడు కె. శ్రవణ్ (మృతుడు) జరిగిన విషయం తెలుసుకుని, గొడవకు గల కారణాన్ని అడగడానికి బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో పంగా నిఖిల్ తన స్నేహితులైన బి. నందు, సాయి, రమేష్‌లతో కలిసి శ్రవణ్‌ను అడ్డగించి రమేష్ ఇంటి ముందు గొడవకు దిగారు.

*కత్తితో విచక్షణారహితంగా దాడి.. ఆసుపత్రిలో మృతి
ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో పంగా నిఖిల్ తన ఇంట్లో నుండి కత్తి తీసుకువచ్చి శ్రవణ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఛాతీ, నడుము, తొడలు, చంక భాగాల్లో తీవ్రంగా పొడవడంతో శ్రవణ్ రక్తపు మడుగులో కుప్పకూలాడు.

*వైద్యుల ప్రకటన:
 తీవ్ర రక్తస్రావమైన శ్రవణ్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న (జూన్ 1) ఉదయం 05:19 గంటలకు శ్రవణ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

*రంగంలోకి ప్రత్యేక బృందాలు.. నిందితుల అరెస్టు
మృతుడి తండ్రి పరశురామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారేడ్‌పల్లి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్కాజిగిరి డీసీపీ సి.హెచ్. శ్రీధర్, అదనపు డీసీపీ కె. రామ్ కుమార్, బేగంపేట్ ఏసీపీ పి. గోపాల కృష్ణమూర్తి, గోపాలపురం డివిజన్ ఏసీపీ పి. సుబ్బయ్యల పర్యవేక్షణలో, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నోముల వెంకటేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.
సాంకేతిక ఆధారాలు, నిఘా కెమెరా (సీసీటీవీ) దృశ్యాలను పరిశీలించి, ఘటనా స్థలం నుండి రక్తపు మరకలున్న కత్తిని, ఇతర భౌతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

*అరెస్టు అయిన నిందితుల వివరాలు:
 *A-1) పంగా సాయి నిఖిల్ (22):నిరుద్యోగి, సంజీవయ్య నగర్.
 *A-2) బండి ఆనంద్ అలియాస్ నందు (19): నిత్యావసర వస్తువుల సరఫరాదారు (రైడర్), సంజీవయ్య నగర్.
 *A-3) చింతకాయల సాయినాథ్ (26):*ప్రైవేట్ ఉద్యోగి, సంజీవయ్య నగర్.
 *A-4) రాసేపల్లి రమేష్ (20):ద్విచక్రవాహన సేవల చోదకుడు (రైడర్), సంజీవయ్య నగర్.

*యువతపై పర్యవేక్షణ అవసరం: పోలీసుల విజ్ఞప్తి
ఈ ఘోర కలికలిపై బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పందిస్తూ.. తల్లిదండ్రులు, కాలనీ పెద్దలు తమ పిల్లల, స్థానిక యువత ప్రవర్తనపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు వంటివి గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని పేర్కొన్నారు.

About The Author