సామాజిక తెలంగాణ సాధనే అమరులకు నిజమైన నివాళి
తెలంగాణ ఉద్యమకారుల సంఘం సిద్దిపేట పిలుపు
సిద్దిపేట:
సామాజిక తెలంగాణ సాధనే అమరులకు నిజమైన నివాళి అని సిద్దిపేట తెలంగాణ ఉద్యమకారుల సంఘం సభ్యులు పిలుపునిచ్చారు .మంగళవారం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల సంఘం సిద్దిపేట ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి చౌరస్తా, రైతుబజార్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరులు, ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే కమిటీ నియామకంలో మరింత సామాజిక సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అన్ని జిల్లా కేంద్రాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి, వివిధ వేదికలు, ప్రజా సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. అలాగే అమరుల కుటుంబాలు, ఉద్యమకారుల కుటుంబాల జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఉద్యమ కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కళాకారులకు సముచిత న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ, త్వరలో జిల్లా మంత్రి మరియు గుర్తింపు కమిటీ సభ్యుడు పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సత్తయ్య, డా. పాపయ్య, తిరుపతి రెడ్డి, కర్రోళ్ల రవిబాబు, ఖమ్మంపల్లి యాదగిరి, ఎ. శ్రీహరి, పోచబోయిన శ్రీహరి యాదవ్, పెద్దిరాజు, బి. చంద్రబాను, డప్పు బాబు తదితరులు, వివిధ నియోజకవర్గ, మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు..jpeg)

