హైడ్రా యాక్షన్ ప్లాన్: ఐటీ కారిడార్‌కు 'వరద' గండం గట్టెక్కించేలా ముందస్తు వ్యూహం!

  • మహానగరంలో ముంపు నివారణకు 15 రోజుల గడువు
  • *యుద్ధప్రాతిపదికన రంగంలోకి హైడ్రా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం

హైడ్రా యాక్షన్ ప్లాన్: ఐటీ కారిడార్‌కు 'వరద' గండం గట్టెక్కించేలా ముందస్తు వ్యూహం!

హైదరాబాద్:

భాగ్యనగర గుండెకాయ, ఆర్థిక చోదక శక్తి అయిన ఐటీ కారిడార్‌ను వర్షాల ముప్పు నుండి రక్షించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. వర్షాకాలంలో రహదారులపై ఐదు నిమిషాలు నీరు నిలిచినా.. కిలోమీటర్ల మేర రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందనే చేదు నిజాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త ముందస్తు వ్యూహానికి తెరతీసింది. వర్షాకాల సన్నద్ధతపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో అత్యున్నత స్థాయి ఉమ్మడి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
కార్పొరేషన్ పరిధిలో నీరు నిలిచే 202 ముంపు ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. ఇందులో అత్యంత తీవ్రమైనవి 83, మధ్యస్థమైనవి 95, స్వల్ప ఇబ్బందులు ఉన్నవి 24 ప్రాంతాలుగా వర్గీకరించారు. రాబోయే 15 రోజుల్లో ఈ ముంపు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం కనుగొనాలని, ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే తాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేయాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు.

*జాప్యాన్ని సహించేది లేదు.. అధికారులకు హైడ్రా కమిషనర్ హెచ్చరిక:

 "కేవలం ఇతర శాఖల అనుమతుల కోసం లేఖలు రాశామని ఫైళ్లు ముట్టజెప్పి చేతులు దులుపుకుంటే కుదరదు. సమస్యల తీవ్రతను బట్టి తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. నిధులు, అనుమతుల నెపంతో పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదు."

*ఐటి కారిడార్ రక్షణకు చతుర్విధ వ్యూహం!
రహదారులపై వరదలు రాకుండా, ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు హైడ్రా కమిషనర్ నాలుగు ప్రధాన సూత్రాలను ఖరారు చేశారు:

 *మొదటి ప్రాధాన్యం పూడికతీతకే: నగరంలోని ప్రధాన వరద కాలువలు, నాళాల్లో ఉన్న పూడికను పూర్తిగా తొలగించే పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి.

 *ముందస్తు కొమ్మల కత్తిరింపు: గాలివానలు వీచినప్పుడు విరిగిపడే ప్రమాదమున్న వృక్షాలను ముందుగానే గుర్తించి, వాటి కొమ్మలను శాస్త్రీయంగా కత్తిరించాలి.

 *మ్యాన్‌హోల్స్ పటాల గుర్తింపు:
వర్షం పడినప్పుడు రోడ్లపై తెరిచి ఉంచే మ్యాన్‌హోల్స్ వల్ల ప్రాణనష్టం జరగకుండా, వాటి స్థానాలను స్పష్టంగా తెలిపేలా డిజిటల్ పటాలను (మ్యాపింగ్) సిద్ధం చేయాలి.

*ప్రత్యామ్నాయ మార్గాల సమాచారం:
 కేవలం లఘు సందేశాల (SMS) ద్వారా భారీ వర్షాల సమాచారం ఇవ్వడమే కాకుండా, వరద ముప్పు ఉన్న మార్గాల వివరాలను, ప్రత్యామ్నాయ ప్రయాణ దారులను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయాలి.
అంతకుముందు, హైడ్రా అదనపు కమిషనర్ వర్ల పాపయ్య డిజిటల్ తెరల ద్వారా నగరంలోని ప్రధాన ముంపు ప్రాంతాల వివరాలను, విపత్తు ప్రతిస్పందన దళాల క్షేత్రస్థాయి కార్యాచరణను వివరించారు.

*ముంపు నివారణకు 'చెరువుల' ప్రక్షాళన: 30 చెరువులకు గేట్లు!

ఈ ఏడాది కురిసే వర్షాల సరళిపై వాతావరణ శాఖ హెచ్చరికలను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జూన్ 8వ తేదీ నాటికి వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని, ఈ ఏడాది తక్కువ రోజులు వర్షాలు పడినా.. పడినప్పుడు మాత్రం మేఘమధనం తరహాలో కుంభవృష్టిగా ఉండే ప్రమాదం ఉందని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.

దీనిని తట్టుకోవడానికి ఐటీ కారిడార్ పరిధిలో వరద నీరు పెద్దమొత్తంలో చేరే దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువుతో పాటు మొత్తం 30 కీలకమైన చెరువులకు తక్షణమే నీటి నియంత్రణ గేట్లను (స్లూయిజ్ గేట్లు) ఏర్పాటు చేయాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షానికి ముందే ఈ చెరువుల్లోని నీటి మట్టాన్ని కొంతవరకు తగ్గించి ఉంచితే, కుంభవృష్టి కురిసినా వరద నీరు సాఫీగా చెరువుల్లోకి చేరి, అంచనాలకు మించి కాలనీలపైకి పోటెత్తే ప్రమాదం తప్పుతుందని స్పష్టం చేశారు. అలాగే, రైల్వే కిందటి వంతెనల (RUB) వద్ద ఏర్పాటు చేసిన మోటార్ పంపులను, వంతెనలపై పడిన వర్షపు నీరు కిందకు వెళ్లేలా చేసిన రంధ్రాలను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు.

*98 శాతం పూడికతీత పూర్తి: కార్పొరేషన్ కమిషనర్ సృజన
వివిధ శాఖలు చేసిన సూచనల మేరకు ఐటీ కారిడార్‌లో ప్రజాసౌకర్యార్థం తగిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ప్రకటించారు. ఇప్పటికే నగరంలో దాదాపు 98 శాతం పూడికతీత పనులు పూర్తయ్యాయని ఆమె వెల్లడించారు. నగర పరిధిలో ప్రమాదకరంగా ఉన్న 161 శిథిల భవనాలను గుర్తించామని, త్వరలోనే వాటిని పరిశీలించి కూల్చివేత లేదా మరమ్మతు చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా, జలమండలి, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయం చేసుకుంటామని స్పష్టం చేశారు.
వర్షాకాలంలో తలెత్తే రవాణా ఇబ్బందులను, ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలను ట్రాఫిక్ ఉప కమిషనర్ (డీసీపీ) శేషాద్రి రెడ్డి, అదనపు ఉప కమిషనర్ (అడిషనల్ డీసీపీ) హనుమంతరావు వివరించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో హైడ్రా అదనపు కమిషనర్ ఆర్. సుదర్శన్, కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతీయ కమిషనర్లు (జోనల్ కమిషనర్లు), సహాయ కమిషనర్లు (ఏసీపీలు), జిల్లా అటవీ అధికారి గౌతమ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని దిశానిర్దేశం చేశారు.WhatsApp Image 2026-06-01 at 19.41.30

About The Author