విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు..

  • నూతన సబ్ స్టేషన్ల కోసం స్థలాల కేటాయింపు..
  • అతి త్వరలో 4 నూతన సబ్ స్టేషన్ల ప్రారంభం..
  • ఇనుప స్తంభాలను వెంటనే తొలగించండి..
  • స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారం..
  • విద్యుత్ఘాతంలో పశువులు చనిపోతే  తక్షణమే నష్టపరిహారం చెల్లించండి..
  • విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ 

విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు..

పటాన్‌చెరు:

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా నూతన సబ్ స్టేషన్లతో పాటు ట్రాన్స్ఫార్మర్ల, స్థంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 

గురువారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ప్రధానంగా నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, భూ కేటాయింపులు, పూర్తయిన సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాల అంశాలపై చర్చించారు. 

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇండోర్ సబ్ స్టేషన్, సింఫనీ కాలనీ, పోచారం, లకడారం సబ్ స్టేషన్లు పనులు తుది దశకు చేరుకున్నయని.. అతి త్వరలో వీటిని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు..

మాదారం, రామేశ్వరంబండ, ఉస్మాన్నగర్, బొల్లారంల పరిధిలో సబ్స్టేషన్ల ఏర్పాటు కోసం భూ కేటాయింపులు  సైతం పూర్తయ్యాయని.. ఆర్థిక శాఖ నుండి ఒక్కో సబ్స్టేషన్కు ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. వెంటనే నిధులు మంజూరు చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు విన్నవించడం జరిగిందని తెలిపారు. 

నియోజకవర్గ పరిధిలో ఇనుప విద్యుత్ స్తంభాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని .. తక్షణమే తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ఘాతంతో పశువులు మృతి చెందితే కాలయాపన చేయకుండా వెంటనే సంబంధి రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

నూతన సబ్స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు అందిస్తే రెవెన్యూ అధికారులతో చర్చించి స్థలాలు కేటాయించడం జరుగుతుందని అధికారులకు తెలిపారు. 

ప్రస్థుత వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర విద్యుత్ అందించి అద్భుతంగా పనిచేశారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ పని చేయాలని కోరారు. 

మున్సిపాలిటీల పరిధిలో సంబంధిత శాఖల  అధికారులతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరారు. 

శిథిలావస్థలో ఉన్న స్తంభాలను వెంటనే తొలగించడంతోపాటు నూతన స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని.. వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి సిఎస్ఆర్ నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. 

ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డిఈ  భాస్కరరావు, ఏడిఈ లు సంజయ్, దుర్గా ప్రసాద్, నాగరాజు, జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, ఏఈలు పాల్గొన్నారు.

About The Author