ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ విచారణకు హాజరైన బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాత

ఎన్నికల సమయంలో మా కదలికలపై నిఘా పెట్టారు.. మాజీ మంత్రిపైనే మాకు అనుమానం ఉంది’

ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ విచారణకు హాజరైన బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాత

హైదరాబాద్:

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్) విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు బుధవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
సుమారు 30 నిమిషాల పాటు సిట్ అధికారులు తమ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారని పారిజాత తెలిపారు. 2022వ సంవత్సరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు తమ ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారని ఆమె పేర్కొన్నారు.

*అధికారులు చెప్పే వరకు తెలియదు..
తాము నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండడం వల్ల తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే విషయాన్ని గమనించలేకపోయామని మాజీ మేయర్ చెప్పారు. అధికారులు స్వయంగా చెప్పేంత వరకు తమ వ్యక్తిగత సంభాషణలపై నిఘా ఉందనే విషయం తమకు తెలియదన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ భార్యాభర్తలిద్దరి ఫోన్లను ట్యాప్ చేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 "మహేశ్వరం నియోజకవర్గంలో తాము రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడానికే ఈ కుట్రకు పాల్పడ్డారు. ప్రజాక్షేత్రంలో దొంగదారిన కాకుండా, సేవా కార్యక్రమాలతో పోటీ పడి రాజకీయం చేయాలి కానీ.. ఇలాంటి నిఘా చర్యలకు పాల్పడడం సరికాదు."
 "చిగురింత పారిజాత, బడంగ్‌పేట్ మాజీ మేయర్"

*మాజీ మంత్రిపైనే అనుమానాలు!
గత ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ మహిళా నేత, మాజీ మంత్రి తమపై కక్ష్యపూరితంగా వ్యవహరించారని పారిజాత ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో తాము ఆమెకు గట్టి పోటీగా మారుతామనే భయంతోనే.. దగ్గరుండి మరీ తమ ఫోన్లను ట్యాపింగ్ చేయించారనే బలమైన అనుమానం తమకు ఉందన్నారు.
ఎన్నికల సమయంలో తమ కదలికలపై నిరంతరం నిఘా పెట్టేవారని, తాము చేపట్టే ప్రతి కార్యక్రమానికి అడుగడుగునా అడ్డుతగిలేవారని గుర్తుచేశారు. తమ రాజకీయ వ్యూహాలను ముందే పసిగట్టి, తమతో కలిసి పనిచేయాలనుకున్న స్థానిక నాయకులను, కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురిచేశారని ఆమె ధ్వజమెత్తారు.

*సిట్ విచారణపై పూర్తి నమ్మకం ఉంది..
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న సిట్ విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని పారిజాత నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తమకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన అసలైన నిందితులకు, సూత్రధారులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

About The Author