*వానాకాలం సన్నద్ధతపై సర్కార్ నజర్!
- *ఎగువ రాష్ట్రాలతో నదీ జలాల సమన్వయానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
- *యుద్ధప్రాతిపదికన జలాశయాల గేట్ల మరమ్మతులు... నిధుల కొరత లేదు.
- *సాగు మార్పిడిపై రైతులకు అవగాహన... నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం వేగవంతం
*భారత శక్తి :
రాబోయే వానాకాలంలో వర్షభావ పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నందున, కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా జలాలను సాధించుకునేందుకు అధికారులు తక్షణమే రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు తమ జలాశయాలు నిండిన తర్వాతే నీటిని కిందకు విడుదల చేసే విధానాన్ని పాటిస్తే రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే ముందస్తుగానే ఆయా రాష్ట్రాల అధికారులతో నిష్పత్తి (ప్రొరేటా) ప్రకారం నీటి విడుదలపై చర్చలు జరపాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన వర్షాకాల సన్నద్ధత సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు..jpeg)
*అంతరాష్ట్ర జలాలపై ముందస్తు కార్యాచరణ
మహారాష్ట్రలోని కోయనా జలాశయం నీటిని ఆ రాష్ట్రం పూర్తిగా జల విద్యుత్ ఉత్పత్తికే వినియోగిస్తోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ నీటిని తెలంగాణకు తీసుకొని, దానికి బదులుగా వారికి అవసరమైన విద్యుత్తును సరఫరా చేసేలా చర్చలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. గోదావరి, ప్రాణహిత నదుల నుంచి వచ్చే వరద నీరు స్వల్ప కాలంలోనే సముద్రం పాలు కాకుండా, ఆ నీటిని సమర్థవంతంగా మళ్లించేందుకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలన్నారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సీలేరు, తుంగభద్ర జలాశయాల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక సమర్పించాలని విద్యుత్ శాఖను ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని జలాశయాల గేట్ల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గేట్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు తెలపగా, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఈ వానాకాలంలో జలాశయాల నిర్వహణలో ఏ చిన్న లోపం తలెత్తినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
*పంటల వైవిధ్యం.. ‘కృత్రిమ మేధ’తో అవగాహన
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వ్యవసాయ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.
*ఈ అవగాహన కోసం కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో రూపొందించిన లఘు చిత్రాలను, దృశ్య శ్రవణ (వీడియో) మాధ్యమాలను ప్రదర్శించాలి. టీవీ ఛానళ్లలోనూ వీటిని ప్రసారం చేయాలి.
*రామగుండం కర్మాగారం నుంచి ఉత్పత్తి అయ్యే యూరియాను పూర్తిగా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు.
*బాధితులకు తక్షణ సాయం.. పాత హామీలపై నివేదిక
గత ఏడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల పర్యటనలో తాను ఇచ్చిన హామీల ప్రగతిపై సీఎం ఆరా తీశారు. హామీల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయన్నారు. వరదలు, ప్రకృతి విపత్తుల వల్ల ప్రాణ, ఆస్తి, పశు నష్టం వాటిల్లితే తక్షణమే ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేసి, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనల పునర్నిర్మాణానికి విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ. 1000 కోట్లను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని సూచించారు..jpeg)
*నగరంలో వరద నివారణ చర్యలు
నగర పరిధిలో వర్షపు నీరు నిలిచే 141 ప్రాంతాలను గుర్తించి, అక్కడ "నీటి సంరక్షణ బావులు (వాటర్ హార్వెస్టింగ్ వెల్స్) నిర్మించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 11 బావుల నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలపగా, మిగిలిన పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను సీనియర్ అధికారి జయేశ్ రంజన్‌కు అప్పగించారు. వానాకాలంలో నగర సమస్యల పరిష్కారానికి ముగ్గురు పురపాలక సంఘ కమిషనర్లు, ముగ్గురు పోలీసు కమిషనర్లు సమన్వయంతో పని చేయాలన్నారు.
*తాగునీటికి డోకా లేదు
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అవసరాలకు అనుగుణంగా తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులు జరపాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, పరివర్తకాలు (ట్రాన్స్‌ఫార్మర్లు) దెబ్బతింటే తక్షణమే పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అవసరమైన సామగ్రిని ముందే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
*కలెక్టర్లు, ఎస్పీల సమన్వయమే కీలకం,
జిల్లా స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు (ఎస్పీలు) క్రమంతప్పకుండా సమావేశం కావాలని సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు సమన్వయంతో ముందుకు సాగినప్పుడే క్షేత్రస్థాయిలో పాలన విజయవంతమవుతుందని పేర్కొన్నారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఇన్‌ఛార్జ్ పీఏ, రక్షకభట నిలయ ప్రధాన అధికారి (DGP) సి.వి. ఆనంద్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు మరియు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని కమిషనర్లు పాల్గొన్నారు..jpeg)
