*అక్షరాల అంగడిలో ‘ఉత్తరాది’ రాబందులు!

  • *తెలంగాణ విద్యావ్యవస్థపై ‘కోట’ మాఫియా నిశ్శబ్ద పంజా.. 
  • కార్పొరేట్ చెరసాలలో నలిగిపోతున్న బాల్యం!
  • *రూ. వేల కోట్ల దోపిడీకి ‘నో-కాస్ట్ ఈఎంఐ’ల ఉచ్చు.. ఇంటర్ బోర్డు కళ్లుండీ గ్రుడ్డిదేనా? అధికారుల మిలాఖత్‌పై ‘భారత శక్తి’ సంచలన రిపోర్ట్!

*అక్షరాల అంగడిలో ‘ఉత్తరాది’ రాబందులు!

మన తెలంగాణల ఇంటర్ సదువంటే ఒకప్పుడు ముచ్చటైన ముచ్చట. కానీ, ఇయ్యాల గిది పైసలొచ్చే పెద్ద బిజినెస్ అయిపోయింది! మన లోకల్ కార్పొరేట్ తిమింగలాలు చాలవన్నట్టు, ఉత్తరాది నుంచి వచ్చిన ‘కోటా’ రాబందులు కూడా జతకల్సిండ్రు. ర్యాంకుల ఎర వేసి, 'నో-కాస్ట్ ఈఎంఐ'ల ఉచ్చుతోటి గరీబోళ్ల, మధ్య తరగతి తల్లిదండ్రులకు జేబులకు చిల్లులు పెడుతుండ్రు. జైళ్ల లాంటి క్యాంపస్‌లల్లా పొద్దుగాల్న నంచి రాత్రి దాకా రుబ్బుడు.. మార్కులు తక్కువొస్తే పిల్లల్ని పశువులకంటే హీనంగా సూసుడు.. గిదేం సదువురా అయ్యా? ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం ముడుపులు తిని, కండ్లుండి గ్రుడ్డోళ్లలా నటిస్తుండ్రు. మన పిల్లల ప్రాణాల్ని, బాల్యాన్ని మింగుతున్న ఈ అక్షరాల అంగడి దోపిడీని నడిబజార్ల ఎండగడుతూ ‘భారత శక్తి’ అందిస్తున్న సంచలన దర్యాప్తు కథనం గిది!

( పరిశోధనాత్మక పాత్రికేయులు: ఎం.వేణుగోపాల్ రెడ్డి)

 

హైదరాబాద్:
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య అంటే ఒకప్పుడు అదొక పవిత్రమైన విద్యాదశ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. కానీ నేడు అదొక మైండ్ గేమ్.. కొన్ని వేల కోట్ల రూపాయల నెత్తుటి కూడు తినే కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యం! భాగ్యనగరాన్ని హబ్‌గా చేసుకుని దశాబ్దాలుగా నిలువు దోపిడీకి అలవాటు పడ్డ స్థానిక కార్పొరేట్ తిమింగలాలు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు తోడు.. ఇప్పుడు ఉత్తరాది నుంచి దిగుమతి అయిన 'కోట' విద్యా మాఫియా జతకట్టింది. రాజస్థాన్‌లోని కోట (Kota) కేంద్రంగా దేశాన్ని కుదిపేసిన ‘నీట్’ పేపర్ లీకేజీల మూలాలున్న అలెన్ (Allen), రెజోనెన్స్ (Resonance), ఫిట్‌జీ (FIITJEE), ఆకాష్ (Aakash) వంటి జాతీయ శకునులు నేడు తెలంగాణ గడ్డపై విద్యావ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాయి. నూతన విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభాన్ని ఆసరాగా చేసుకుని, ఈ ఉత్తరాది-దక్షిణాది మాఫియా సిండికేట్‌గా మారి సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు నిలువునా కత్తి పడుతోంది. ఈ మెరిసే ర్యాంకుల వెనుక ఉన్న చీకటి కోణాలు, విద్యా చట్టాల ఉల్లంఘనలు, సమాంతర ఫైనాన్స్ దందాపై ‘భారత శక్తి’ ప్రత్యేక క్షేత్రస్థాయి విశ్లేషణ.WhatsApp Image 2026-06-01 at 20.36.49

*ఫలితాలు రాకముందే వేట.. పక్కా స్కెచ్‌తో టెలి-కాలింగ్ దాడులు!
టెన్త్, సీబీఎస్‌ఈ ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల దందా బరితెగించింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్ల నుంచి అక్రమ మార్గాల్లో, రూ. లక్షలు చెల్లించి విద్యార్థుల డేటాను (ఫోన్ నెంబర్లను) ఈ మాఫియా కొనుగోలు చేస్తోంది. ప్రత్యేకంగా ‘టెలి-కాలర్ల’ సైన్యాన్ని రంగంలోకి దించి, తల్లిదండ్రులకు రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తూ మానసిక దాడికి దిగుతున్నారు. “ఇప్పుడే సీటు బుక్ చేసుకోకపోతే మీ పిల్లల భవిష్యత్తు శూన్యం” అంటూ భయబ్రాంతులకు గురిచేస్తూ, ఫలితాలు రాకముందే ‘అడ్వాన్స్ బుకింగ్’ పేరిట వేల రూపాయలు గుంజుతున్నారు.

*అనుమతి ఒకదానికి.. వ్యాపారం మరొకదానికి: ఇంటర్ బోర్డు ‘కాగితాల’కే పరిమితం!
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టి.జి.బి.ఐ.టి) నిబంధనల ప్రకారం, కేవలం ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సులను నిర్వహించడానికి మాత్రమే కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలేషన్) ఇస్తారు. ఎటువంటి కోచింగ్ సెంటర్లను కాలేజీ ప్రాంగణాల్లో నడపడానికి వీలులేదు. కానీ ఈ ఉత్తరాది మాఫియా చట్టాన్ని తుంగలో తొక్కింది.WhatsApp Image 2026-06-01 at 20.37.33 (1)

 *‘ఇంటిగ్రేటెడ్’ మోసం:
శ్రీ చైతన్య, నారాయణలతో పాటు, నానో జూనియర్ కాలేజీలు, తేజ్ జూనియర్ కాలేజీల తో పాటు ఉత్తరాది బ్రాండ్లు అలెన్, రెజోనెన్స్ వంటి సంస్థలు 'ఇంటిగ్రేటెడ్ ఐఐటీ/నీట్' బ్యాచ్‌ల పేరుతో ఒకే గొడుగు కింద చట్టవిరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తూ బోర్డు రూల్స్ ముఖాన కొడుతున్నాయి.

 గుర్తింపు లేదు.. ఫైర్ సేఫ్టీ లేదు.. అయినా అడ్మిషన్ల జాతర: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందలాది ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు బోర్డు నుంచి ఎలాంటి అనుబంధ గుర్తింపు లేదు. కనీస ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ (Fire Safety NOC) కూడా లేని కమర్షియల్ కాంప్లెక్స్‌లలో, ఇరుకు గదులలో, గాలి ఆడని ల్యాబ్‌లలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ఈ డెత్ క్యాంప్‌లు నడుస్తున్నాయి.

 *భానుడి భగభగల్లో ‘సమ్మర్ క్యాంపుల’ హింస: మే నెల ఆఖరి దాకా వేసవి సెలవులు ఇవ్వాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఏప్రిల్ మొదటి వారం నుంచే సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభించి విద్యార్థులను భానుడి భగభగలకు గురిచేశారు. ఏసీల పేరుతో అదనపు బాదుడు బాదడమే తప్ప కనీస మానవతా దృక్పథం లేకుండా పిల్లలను క్లాసుల్లో బంధించారు.

లొసుగుల 'ఈఎంఐ'లు – సమాంతర ఫైనాన్స్ మాఫియా అవతారం!
హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఇంటర్ కాలేజీలలో ఫీజులు రూ. 1,50,000 నుండి ప్రారంభమై రూ. 4 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యకు పటిష్టమైన ఫీజు నియంత్రణ కమిటీ (Fee Regulatory Committee) లేకపోవడాన్ని ఈ విద్యాసంస్థలు పెట్టుబడిగా మార్చుకున్నాయి.

*‘నో-కాస్ట్ ఈఎంఐ’ అనే మాయా ఉచ్చు!

మధ్యతరగతి తల్లిదండ్రులను ఆకర్షించడానికి ఈ కాలేజీలు కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలతో (FinTech Companies) అపవిత్ర బంధాన్ని ఏర్పరుచుకున్నాయి. 'నో-కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్ అంటూ నమ్మబలికి, తల్లిదండ్రుల సంతకాలు తీసుకుని వారి పేరుతో భారీ వడ్డీలతో కూడిన పర్సనల్ లోన్లు మంజూరు చేయిస్తున్నారు. ఫీజులు సకాలంలో కట్టకపోతే విద్యార్థులను క్లాసుల నుండి బయటకు పంపడం, క్వశ్చన్ పేపర్లు ఇవ్వకపోవడం, హాల్ టికెట్లు ఆపేస్తామని బెదిరించడం వంటి థర్డ్ డిగ్రీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. ఇది విద్యార్థుల చదువుపైనే కాక, తల్లిదండ్రుల సిబిల్ (CIBIL) స్కోరుపై కూడా దెబ్బకొడుతోంది.

*గొర్రెల మందల్లా సెక్షన్లు.. కోట్లల్లో దోపిడీ సామ్రాజ్యం!
బోర్డు నిబంధనల ప్రకారం ఒక్కో క్లాసులో 40 నుండి 45 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. కానీ లాభాల కక్కుర్తితో ఒక్కో క్లాసులో 80 నుండి 100 మంది విద్యార్థులను గొర్రెల మందలా కుక్కుతున్నారు.
 * ఒక్కో కాలేజీ క్యాంపస్ ఐదు నుండి పది సెక్షన్లు ఏర్పాటు చేస్తూ ఒక్కో విద్యార్థి నుంచి సగటున రూ. 1.50 లక్షలకు తగ్గకుండా ఫీజు వసూలు చేస్తోంది.
 * ఈ లెక్కన ఒక కాలేజీ కేవలం ఒక బ్రాంచ్‌లోనే 500 మంది విద్యార్థుల నుండి ఏడాదికి ఫీజు రూపేణా రూ. 7.50 కోట్లు దండుకుంటోంది.

 *గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 700 పైచిలుకు కాలేజీల ద్వారా ఈ విద్యా మాఫియా ఏటా రూ. వేల కోట్ల నల్లధనాన్ని ఆర్జిస్తోంది.

*ఉత్తరాది మాఫియా – ‘కోటా’ డెత్ కల్చర్ తెచ్చిన ముప్పు!
రాజస్థాన్‌లోని 'కోటా'లో ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించే భయంకరమైన ‘కోటా సంస్కృతి’ని అలెన్, రేజోనెన్స్ వంటి సంస్థలు హైదరాబాద్‌కు దిగుమతి చేశాయి.

 14 గంటల నిర్బంధం.. గ్రేడింగ్ హింస:* రోజుకు 12 నుండి 14 గంటల క్లాసులు, తెల్లవార్లూ వీక్లీ టెస్టులు, ఆ మార్కుల ఆధారంగా విద్యార్థులను పశువుల్లా విభజించడం (స్టార్ బ్యాచ్, చైనా బ్యాచ్, నియాన్ బ్యాచ్, డమ్మీ బ్యాచ్) ఈ ఉత్తరాది సంస్థల ప్రధాన శైలి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను క్లాస్ రూముల్లోనే ఉపాధ్యాయుల చేత అవమానించడం వల్ల వారు తీవ్ర మానసిక కుంగుబాటుకు (Depression) లోనవుతున్నారు.

 *ఆత్మహత్యల శరణాలయాలుగా రెసిడెన్షియల్ క్యాంపస్‌లు:
ఇంటర్ బోర్డు అంతర్గత విచారణల్లో అత్యధిక శాతం విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఉత్తరాది, స్థానిక కార్పొరేట్ సంస్థల రెసిడెన్షియల్ (హాస్టల్) క్యాంపస్‌లలోనే జరుగుతున్నట్లు తేలింది. జైళ్లను తలపించే ఐరన్ గ్రిల్స్, కిటికీలకు ఇనుప జాలీలు.. వీరికి కనీస శారీరక శ్రమ, ఆటలు, కన్నవారికి ఫోన్ చేసుకునే వినోదం కూడా ఉండవు. బాల్యాన్ని బలితీసుకుంటూ ర్యాంకులు సాధించే ఈ రక్తాకూడు సంస్కృతిపై సమాజం నివ్వెరపోతోంది.

*లాసెట్ (LAWCET/CLAT) లోనూ కొత్త దోపిడీ ముఠాలు!
కేవలం సైన్స్ గ్రూపులే కాకుండా హ్యుమానిటీస్, లా, కామర్స్ గ్రూపులను కూడా ఈ మాఫియా వదల్లేదు. గ్యాన్‌విల్లే అకాడమీ, గాతిక్ జూనియర్ కాలేజ్, పేజ్, అభ్యాస్ వంటి సంస్థలు క్లాట్ (CLAT), లాసెట్ శిక్షణ పేరిట ఒక్కో విద్యార్థి నుండి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.

*డమ్మీ అడ్మిషన్ల నెట్‌వర్క్: ఇంటర్ బోర్డు అధికారుల ‘మిలాఖత్’?
ప్రతి సంవత్సరం ఇంటర్ బోర్డు టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేయడం, నోటీసులు జారీ చేయడం ఒక కంటితుడుపు ప్రహసనంగా మారింది. ఈ విద్యాసంస్థల వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక పలకుబడి ముందు బోర్డు అధికారులు మోకరిల్లుతున్నారు.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రధాన బ్రాంచ్‌లలో ఒకే భవనంలో వేల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ బోర్డు నిబంధనల ప్రకారం ఒక సెక్షన్‌కు పరిమితి దాటకూడదు. దీనికోసం వీరు జిల్లాల్లో ఉన్న తమ ఇతర అనుబంధ (గుర్తింపు ఉన్న) డమ్మీ కాలేజీల పేరుతో విద్యార్థులను పరీక్షలకు ఎన్‌రోల్ చేస్తారు. విద్యార్థి హైదరాబాద్‌లో చదువుతుంటే, హాల్ టికెట్ మాత్రం ఏదో మారుమూల జిల్లా కాలేజీ పేరుతో వస్తుంది. ఈ వికృత అక్రమ నెట్‌వర్క్ బోర్డు అధికారుల కళ్లముందే జరుగుతున్నా.. భారీగా ముడుపులు అందుతుండటం వల్లే అధికారులు మౌనముని వ్రతం పాటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

**ప్రభుత్వానికి 'భారత శక్తి' డిమాండ్:
తెలంగాణ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్న ఈ ఉత్తరాది, స్థానిక కార్పొరేట్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి తక్షణమే ఒక 'పటిష్టమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని' (Fee Regulation Act) తీసుకురావాలి. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీల గుర్తింపును రద్దు చేయడమే కాకుండా, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యావేత్తలు, తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందా.. లేక విద్యార్థుల ప్రాణాలు బలితీసుకునే ఈ వ్యాపారానికి వత్తాసు పలుకుతుందా అనేది చూడాలి.

About The Author