జగద్గిరిగుట్ట కోనేరుకు ‘హైడ్రా’ జవజీవాలు
ఆక్రమణల తొలగింపు.. 26 ట్రక్కుల వ్యర్థాల తరలింపు
హైదరాబాద్:
జగద్గిరిగుట్టలోని చారిత్రక కోనేరుకు (గుండం) ఎట్టకేలకు విముక్తి లభించింది. దశాబ్దాలుగా ఆక్రమణల కోరల్లో చిక్కుకున్న ఈ కోనేరును హైడ్రా (HYDRAA) అధికారులు మంగళవారం పునరుద్ధరించారు. ఆలయ పూజారి నరహరి గతంలో కన్నీరు పెట్టుకుంటూ చేసిన ఆర్తనాదం, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ చర్యలు చేపట్టారు..jpeg)
26 ట్రక్కుల వ్యర్థాల తొలగింపు
సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేరును స్థానిక కబ్జాదారులు మట్టితో నింపేసి, పార్కింగ్ స్థలంగా మార్చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా సిబ్బంది, మంగళవారం భారీ యంత్రాలతో రంగంలోకి దిగారు. కోనేరులో పేరుకుపోయిన సుమారు 26 ట్రక్కుల, నిర్మాణ వ్యర్థాలు, చెత్తను పూర్తిగా తొలగించారు. ఆక్రమణలను తొలగించి కోనేరు అసలు స్వరూపాన్ని బయటకు తెచ్చారు.
కోనేరు సంరక్షణ కోసం గత 22 ఏళ్లుగా పోరాడుతున్న గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. "నా జీవిత కాలంలో ఈ కోనేరును మళ్ళీ చూస్తానో లేదో అని భయపడ్డాను. భగవంతుడే హైడ్రా రూపంలో వచ్చి ఈ పుణ్యస్థలాన్ని కాపాడారు" అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కొండపై నుంచి వచ్చే వర్షపు నీరు కోనేరులోకి చేరేలా ఏర్పాట్లు చేస్తామని, అవసరమైతే బోర్ల ద్వారా నీటిని నింపి పూర్వవైభవం తెస్తా
మని ఆయన పేర్కొన్నారు.
భక్తుల హర్షం
జగద్గిరిగుట్టలో వెంకటేశ్వర స్వామి, హనుమాన్, గోవిందరాజుల స్వామి, వాసవి కన్యకాపరమేశ్వరి వంటి అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఇంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి, పర్యావరణాన్ని కాపాడిన హైడ్రా పనితీరుపై స్థానికులు మరియు భక్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
