జోరుగా కొనసాగుతున్న టీజీ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

జోరుగా కొనసాగుతున్న టీజీ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

ఎల్బీనగర్:

దిల్ సుఖ్ నగర్ లోని టీజీ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె బుధవారం సంపూర్ణంగా జరిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి దిల్ సుఖ్ నగర్ సిటీ డిపో, జిల్లా డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే కాంట్రాక్టు ఉన్న అర కొర బస్సులను ఆర్టీసీ అధికారులు బలవంతంగా నడిపే ప్రయత్నం చేసినా సమ్మెపై పెద్దగా ప్రభావం చూపలేదు. దిల్ సుఖ్ నగర్ డిపోలో పని చేస్తున్న మొత్తం 483 మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీజీ ఆర్టీసీ జేఏసీ నాయకులు వెంకటయ్య గౌడ్,నిరంజన్ , ఆనంద్, మోహన్ లు మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేస్తే చాలని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీలను జేఏసీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయాలని అదే విధంగా రెండు పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం యూనియన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం మొండి వైఖరితో పోకుండా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు జీవితాలను కాపాడాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా దిల్ సుఖ్ నగర్ సిటీ డిపో ఎదుట కార్మికులు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయడానికి టెంట్ ఏర్పాటుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరశనలు వ్యక్తం చేస్తామని ఎటువంటి ఆందోళనలు చేయమని టెంట్ కింద నినాదాలు చేస్తామని నాయకులు పోలీసులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. టెంట్ లేకుండా కింద కూర్చుని నిరసనలు వ్యక్తం చేసుకోవాలని పోలీసులు నాయకులకు ఉచిత సలహా ఇచ్చారు. దీంతో చేసేది ఏం లేక మండుటెండలోనే కూర్చుని ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు, జేఏసీ నేతలు శాంతియుతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిల్ సుఖ్ నగర్ లో ఉన్న జిల్లా డిపో నుంచి కూడా బస్సులన్నీ డిపోకే పరిమితం అయ్యాయి. హైదరాబాద్ మహా నగరంలో కీలకమైన దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఆర్టీసీ సమ్మె కారణంగా సామాన్యులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ప్రత్యామ్నాయంగా ఆటోలు, మెట్రో రైలు, ర్యాపిడో వంటి వాహనాలను ఆశ్రయించారు. దీంతో ఆటో డ్రైవర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని దిల్ సుఖ్ నగర్ లో ప్రయాణిస్తున్న ప్రజలు వాపోయారు.

About The Author