ఆక్రమణల చెర నుంచి 'అరుణోదయ' పార్కు విముక్తి!

  • రంగంలోకి దిగిన హైడ్రా.. రూ. 60 కోట్ల భూమి స్వాధీనం
  • 3 వేల గజాల స్థలానికి రక్షణగా ఫెన్సింగ్‌, బోర్డులు

ఆక్రమణల చెర నుంచి 'అరుణోదయ' పార్కు విముక్తి!

​నార్సింగి:
విలువైన ప్రభుత్వ భూములే లక్ష్యంగా సాగుతున్న కబ్జారాయుళ్ల ఆగడాలకు 'హైడ్రా' బ్రేక్ వేసింది. గండిపేట మండలం నార్సింగిలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని సోమవారం అధికారులు విముక్తి కల్పించారు. సుమారు రూ. 60 కోట్ల విలువైన 3 వేల గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని, చుట్టూ రక్షణ కవచంలా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

​సాగిందిలా..

​నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలోని అరుణోదయ కాలనీ హుడా (HUDA) అనుమతి పొందిన లేఅవుట్‌లో 6,078 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే, గత కొంతకాలంగా ఈ విలువైన భూమిపై స్థానిక భూబకాసురుల కన్ను పడింది. ఇప్పటికే సుమారు 3 వేల గజాల వరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన 3 వేల గజాల్లోనూ 1,600 గజాలను ఓ వ్యక్తి ఆక్రమించి, ప్రీకాస్ట్ ప్రహరీ నిర్మించి షెడ్లు వేశారు.
​గతంలో నార్సింగి మున్సిపల్ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను తొలగించినప్పటికీ, సదరు వ్యక్తి తీరు మారలేదు. ప్రస్తుతం నార్సింగి మున్సిపాలిటీ జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే ప్రక్రియను ఆసరాగా చేసుకుని, మళ్లీ ప్రహరీ గోడ కట్టి ఆక్రమణకు ప్రయత్నించారు.

ప్రజావాణి ఫిర్యాదుతో కదలిక:

​ఈ కబ్జాపై స్థానికులు హైడ్రా 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. అది పార్కు స్థలమేనని నిర్ధారించుకున్న అనంతరం, సోమవారం ఉదయం ఆక్రమణలను తొలగించారు. మిగిలిన 3 వేల గజాల స్థలం మళ్లీ ఆక్రమణకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు, "ఇది పార్కుకు కేటాయించిన స్థలం" అని తెలిపే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా తీసుకున్న ఈ సత్వర చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About The Author