ఆక్రమణదారుల గుప్పిట నుంచి రూ. 7 కోట్ల భూమి విముక్తి!

  • చక్రపురి కాలనీలో 'హైడ్రా' మెరుపు చర్య.. పార్కు స్థలానికి పక్కాగా ఫెన్సింగ్
  • ​ప్రజావాణి ఫిర్యాదుపై వెనువెంటనే స్పందన.. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఆక్రమణదారుల గుప్పిట నుంచి రూ. 7 కోట్ల భూమి విముక్తి!

అమీన్‌పూర్:

బహిరంగ ప్రదేశాలు, పార్కు స్థలాలపై కన్నేసే భూబకాసురులకు 'హైడ్రా' మరోసారి గట్టి హెచ్చరిక పంపింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చక్రపురి కాలనీలో ఆక్రమణకు గురవుతున్న కోట్లాది రూపాయల విలువైన పార్కు స్థలాన్ని అధికారులు ఆదివారం పక్కా ప్రణాళికతో స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 7 కోట్ల విలువ చేసే 1253.8 గజాల స్థలానికి రక్షణ కవచం ఏర్పాటు చేశారు.
​నిబంధనలు బేఖాతరు..
చక్రపురి కాలనీలోని సర్వే నంబర్ 135లో ఉన్న ఈ స్థలాన్ని 1985లోనే హుడా (HUDA) లేఅవుట్ (LP No. 3814/MP2/HUDA/85) ప్రకారం పార్కు మరియు రోడ్ల కోసం కేటాయించారు. 2022లో గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ భూమిని స్థానిక సంస్థలకు అప్పగించినప్పటికీ, ఇటీవల కొందరు రియల్టర్లు కబ్జాకు యత్నించారు. స్థలం చుట్టూ ఉన్న సరిహద్దు రాళ్లను తొలగించి చాపకింద నీరులా ఆక్రమణకు తెరలేపారు.
​రంగంలోకి 'హైడ్రా' సేన..
కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు 'హైడ్రా' ప్రజావాణిలో ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కమిషనర్ ఏవీ రంగనాథ్ యంత్రాంగాన్ని ఉసిగొల్పారు. ఆదివారం ఉదయమే రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. రికార్డుల ప్రకారం అది పార్కు స్థలమేనని తేలడంతో తక్షణమే చర్యలు ప్రారంభించింది.
​పక్కాగా రక్షణ: ఆక్రమణదారులకు అవకాశం లేకుండా స్థలం చుట్టూ ఇనుప కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేశారు.
​హెచ్చరిక బోర్డులు: "ఇది పార్కు స్థలం - హైడ్రా" అని స్పష్టంగా పేర్కొంటూ బోర్డులను పాతిపెట్టారు.WhatsApp Image 2026-02-08 at 20.12.33

​జన నినాదం.. హైడ్రా జిందాబాద్!

తమ కాలనీ పిల్లల కోసం, స్వచ్ఛమైన గాలి కోసం కేటాయించిన స్థలం తిరిగి దక్కడంతో కాలనీవాసుల ఆనందానికి అవధులు లేవు. అధికారుల పనితీరును ప్రశంసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. "ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా చూపుతున్న చొరవ అభినందనీయం" అని కాలనీవాసులు పేర్కొన్నారు.

About The Author

Related Posts