విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదు..
కరీంనగర్ ప్రతినిధి :
నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు
ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ పేద విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదనీ, పేద విద్యార్థుల చదువులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య మిస్తున్నదని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కొత్తపెళ్లి మండలం చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలను పర్యవేక్షించారు. విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో కలిసి సహంపక్తి భోజనం చేశారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, దొడ్డు బియ్యం ఎందుకు పెడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అధికారులు దొడ్డు బియ్యం పంపిణీ చేయడం సరైనది కాదన్నారు. గత 15 రోజులుగా దొడ్డు బియ్యం అన్నం వండుతున్నారని ప్రిన్సిపాల్ మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే కరీంనగర్ డి ఎస్ ఓ తో మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు. గురుకులానికి సరఫరా చేసిన దొడ్డు బియ్యం వెంటనే మార్చాలని ఆదేశించారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలకు దొడ్డు బియ్యం పంపిణీ చేయడం ఏంటని డిఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయంపై సివిల్ సప్లయిస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్ తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రెండురోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలనీ కమిషనర్ కు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు దొడ్డు బియ్యం సరఫరా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గురుకులంలో మెస్ పరిసరాలు మెరుగు పరచాలని, శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. మెస్ వద్ద అదనపు వాటర్ ప్లాంట్ నిర్మించాలని, వారంలో స్టీల్ వంట పాత్రలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు..