జీహెచ్‌ఎంసీలో 99 రోజుల 'ప్రగతి ప్రణాళిక'
- మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు
- వారానికో థీమ్‌తో కార్యాచరణ
- కార్పొరేషన్ సమావేశంలో 30 అంశాలకు ఆమోదం
హైదరాబాద్:
నగర పరిధిలో 99 రోజుల పాటు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'ను ఫలితాలే లక్ష్యంగా అమలు చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన అధ్యక్షతన తొలి కార్పొరేషన్ సమావేశం జరిగింది. గత స్టాండింగ్ కమిటీ తీర్మానించిన 30 అంశాలపై చర్చించి, కమిటీ ఆమోదం తెలిపింది.
14 వారాల ప్రణాళిక.. వారానికో థీమ్
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగే ఈ ప్రణాళికలో ప్రతి వారం ఒక ప్రత్యేక అంశంపై (థీమ్) దృష్టి సారించనున్నారు.
తొలి వారం (పారిశుద్ధ్యం): గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను (GVP) పూర్తిగా తొలగించాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలి.
ఈ-వేస్ట్, టెక్స్‌టైల్ వ్యర్థాల సేకరణ చేపట్టాలి.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) మరో రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీ ఆస్తులు, అప్పులను మూడు కార్పొరేషన్లకు (జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పంపిణీ చేసే ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇస్తుందని జయేష్ రంజన్ వెల్లడించారు.
ఆమోదం పొందిన కీలక నిర్ణయాలివే..
ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఓవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ నుంచి సంతోష్‌నగర్ వైపు డౌన్ ర్యాంప్ నిర్మాణం, రసూల్‌పురా వద్ద 4 లేన్ల వన్-వే రోడ్డు, రెతిబౌలి-నానల్‌నగర్ జంక్షన్లలో గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం కోసం ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్.
ఫ్లైఓవర్లు - ROBలు: ఫలక్‌నుమా వద్ద సమాంతర ROB, ఫతేనగర్ ఫ్లైఓవర్ పునరుద్ధరణ, ఎన్‌ఎఫ్‌సీఎల్, టీవీ9 జంక్షన్లలో ఫ్లైఓవర్ పనులకు ఆమోదం.
డ్రైనేజీ వ్యవస్థ: సనత్‌నగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో సమగ్ర స్టార్మ్ వాటర్ డ్రైన్, అఫ్జల్ సాగర్ నాలా పునర్నిర్మాణం, శివాజీ నగర్ నుంచి చత్రినాక వరకు బాక్స్ డ్రెయిన్ పనులకు అనుమతి.
పార్కింగ్ - కన్వెన్షన్: ఖిల్వత్ చౌమహల్లా ప్యాలెస్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్, ఎన్‌బీటీ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరును 'కన్వెన్షన్ హాల్'గా మారుస్తూ నిర్ణయం.
బడ్జెట్ కేటాయింపు: కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు తలా రూ.500 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపు. ప్రస్తుతం ఈ కార్పొరేషన్ల ఖర్చులను జీహెచ్‌ఎంసీ జనరల్ ఫండ్ నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కమిషనర్ సత్యనారాయణ, జోనల్ కమిషనర్లు ప్రియాంక అల, మందా మకరందు, ముకుంద రెడ్డి, మంగతాయారు, శ్రీనివాసరెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
