ఐక్యంగా కదిలితేనే వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం
- చెరువుల ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల విస్తరణే కీలకం
- *ఉన్నతాధికారుల బృందం పర్యటనలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్:
నగరంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో, కలసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఉదయం నుంచి నగరంలోని ప్రధాన వరద ముంపు ప్రాంతాలలో ఉన్నతాధికారుల బృందం విస్తృతంగా పర్యటించింది. ఈ బృందంలో డీజీపీ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిలతో పాటు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల ఇంజనీర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*మల్కం చెరువులో పూడిక సమస్య
అధికారుల బృందం మొదటగా రాయదుర్గంలోని మల్కం చెరువును సందర్శించి, వరదకు గల కారణాలపై సమీక్ష నిర్వహించింది. చెరువులో వరద నీటిమట్టాన్ని తగ్గిస్తే ముంపు సమస్య చాలా వరకు తప్పుతుందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. చెరువు నిండా నీరు ఉండటం వల్ల ఇన్‌లెట్ల వద్ద భారీగా పూడిక పేరుకుపోయిందని, దీనివల్ల వరద నీరు ధారాళంగా లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోతోందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. అనంతరం ఖాజాగూడ చెరువు ఇన్‌లెట్ల వద్ద జరుగుతున్న పూడికతీత పనులను, నీరు సజావుగా సాగేలా కాలువ విస్తరణ పనులను బృందం పరిశీలించింది..jpeg)
మాధాపూర్‌లోని దుర్గం చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను అధికారులు పరిశీలించారు. చెరువులో నీరు పోటెత్తడం వల్ల ఇన్‌లెట్ల గుండా వచ్చే వరద నీరు సాఫీగా లోపలికి చేరడం లేదని గుర్తించారు. మురుగునీరు మాత్రమే ఎస్‌టీపీ (STP)లకు వెళ్లేలా, వరద నీరు నేరుగా చెరువులోకి కలిసేలా సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రహించారు. వెంటనే చెరువు ఔట్‌లెట్లను విస్తరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. విఠల్‌రావు నగర్‌లో ఇటీవల ఎస్‌ఎన్‌డీపీ (SNDP) ఆధ్వర్యంలో అందుబాటులోకి తెచ్చిన వరద కాలువకు నీరు చేరక మునిగిపోయిన ప్రాంతాలను కూడా పరిశీలించారు.
*మొండికుంట, జూబ్లీ గార్డెన్స్ లో పనుల పరిశీలన
కొండాపూర్ సంతోష్ దాబా సమీపంలోని వరద కాలువల్లో జరుగుతున్న పూడికతీత పనులను బృందం తనిఖీ చేసింది. మొండికుంటకు వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. జూబ్లీ గార్డెన్స్‌లో స్లాబులు తొలగించి హైడ్రా చేపట్టిన పూడికతీత పనులను సుదర్శన్‌రెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు.
మియాపూర్‌లోని గుర్నాథ్ చెరువు ఇన్‌లెట్లను అధికారులు పరిశీలించారు. అక్కడ ఇన్‌లెట్ కాలువను ఆక్రమించి అపార్ట్‌మెంట్ నివాసితులు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు వరద కాలువలను మూసివేసిన తీరును అధికారులు గమనించారు. హైడ్రా ఇప్పటికే ఆ ప్రహరీలను తొలగించి, లారీల కొద్దీ పూడికను వెలికితీసి వరద కాలువలను పునరుద్ధరించిన పనులను బృందం పరిశీలించింది. చెరువుల ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సక్రమంగా ఉంటేనే వరద ముప్పును నివారించగలమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
*కఠిన చర్యలకు డీజీపీ ఆదేశం
చందానగర్‌లోని గంగారం చెరువు ఇన్‌లెట్లు పూడిపోవడం వల్ల ప్రధాన రహదారి వరద నీటిలో మునుగుతోందని స్థానిక అధికారులు బృందం దృష్టికి తెచ్చారు. రహదారిపై ఉన్న కాలువల పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వెనకాడకుండా పోలీస్ సహకారం తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులకు సూచించారు. రహదారులపై వరద నీరు నిలిస్తే తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అన్ని విభాగాలు సమన్వయంతో వరద కట్టడికి చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
